జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం

1 Jul, 2021 06:28 IST|Sakshi
జమ్మూ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద నిఘా నిర్వహిస్తున్న భారత సైన్యం డ్రోన్‌

ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద యాంటీ డ్రోన్‌ వ్యవస్థ ఏర్పాటు

జమ్మూ: జమ్మూలోని మూడు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. ఈ పరిణామంతో పోలీసులు, సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిరాన్‌ సాహిబ్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.23 గంటలకు ఒక డ్రోన్‌ కనిపించగా, కలుచక్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకి ఒక డ్రోన్, కుంజ్‌వానిలో 4.52 గంటలకి మరో డ్రోన్‌ కనిపించిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగిన దగ్గర్నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట డ్రోన్లు కనిపిస్తూనే ఉన్నాయి.

జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరం వద్ద యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వైమానిక స్థావరంపైనే ఆదివారం డ్రోన్లతో తొలిసారిగా దాడి జరిగిన విషయం తెలిసిందే. డ్రోన్లతో ఏ క్షణంలో ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనని ఈ వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, సాఫ్ట్‌ జామర్లు ఏర్పాటు చేసినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ వైమానిక స్థావరంపై పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో చైనాకు చెందిన డ్రోన్లు వాడినట్టుగా ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది. డ్రోన్ల నుంచి పేలుడు పదార్థాలను జారవిడిచినట్టుగా భావిస్తున్నారు. నైట్‌ విజన్, నావిగేషన్‌ వ్యవస్థ కలిగిన డ్రోన్లను ముష్కరులు వాడినట్టుగా భద్రతా అధికారులు వెల్ల డించారు. మరోవైపు రాజౌరి జిల్లాలో ఏ అవసరానికైనా డ్రోన్లను వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు.   
 

మరిన్ని వార్తలు