వైరల్‌ వీడియో: పాట పాడి.. సంబురంగా చిందులేసిన ద్రౌపది ముర్ము

23 Jul, 2022 12:10 IST|Sakshi

వైరల్‌: ఎక్కడో ఒడిశాలో మారుమూల పల్లెలో పుట్టి కౌన్సిలర్‌ స్థాయి నుంచి.. ఇవాళ దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి ఎదిగి.. తొలి గిరిజన రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు ద్రౌపది ముర్ము(64). జులై 25న సర్వసత్తాక గణతంత్ర‍్య భారత్‌కు 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేయబోతున్నారు. ఈ తరుణంలో.. 

ద్రౌపది ముర్ముకు సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్‌ అవుతున్నాయి. అందునా ఆమె హుషారుగా పాట పాడుతూ.. సరదాగా చిందులు (గిరిజన సంప్రదాయ నృత్యాలను చిందులనే వ్యవహరిస్తారు) వేసిన వీడియో ఒకటి కూడా విపరీతంగా సర్క్యులేట్‌ అవుతోంది. అయితే ఆ వీడియో ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు చేసింది కాదు. అసలు ఆ వీడియో ఈ మధ్యది కాదు.

తన రాజకీయ ప్రస్థానంలో ప్రజానేతగా ఆమెకంటూ మంచి గుర్తింపు దక్కింది. 2018లో జార్ఖండ్‌ గవర్నర్‌గా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆమె స్వగ్రామం నుంచి వెళ్లిన కొందరు మహిళలు.. రాంచీ రాజ్‌భవన్‌ ఎదుట గిరిజన సంప్రదాయ నృత్యాలు నిర్వహించారు. ఆ సందర్భంలో హుషారుగా ఆమె వాళ్లతో కలిసి చిందులేసి.. పాట పాడారు అంతే. 

ముర్ము స్వగ్రామం ఒడిశా మయూర్‌భంజ్‌ జిల్లా రాయ్‌రంగ్‌పూర్‌ ప్రజలు.. దీదీ అని ఆమెను ఆప్యాయంగా పిల్చుకుంటారు. అందుకే ఆమె ఏ పదవిలో ఉన్నా.. తమ ఊరికే గర్వకారణమని భావిస్తుంటారు. తాజాగా ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే ఆమె ఘన విజయాన్ని ఊరంతా సంబురంగా చేసుకుంది.

ఇదీ చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు