విదేశీ టీకాలకు మూడు రోజుల్లోనే అనుమతులు

16 Apr, 2021 05:21 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగానికి విదేశీ కోవిడ్‌ టీకా సంస్థలు పెట్టుకునే దరఖాస్తులపై మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. విదేశీ కంపెనీలు పెట్టుకున్న పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు అవి అందిన మూడు పనిదినాల్లోగా డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్ట్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీవో) అనుమతి మంజూరు చేస్తుందని వివరించింది. సదరు విదేశీ సంస్థ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఉత్పత్తి ప్రాంతం, ఉత్పత్తి) దిగుమతి అనుమతి పత్రాలను సీడీఎస్‌సీవో పరిశీలిస్తుందని పేర్కొంది. సంతృప్తికరంగా ఉంటే ఆయా కోవిడ్‌ టీకాలను పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి మాత్రమే అనుమతిస్తుందని తెలిపింది.  మార్గదర్శకాలకు లోబడి ఆ టీకాను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది.

విదేశీ టీకా కంపెనీలు భారత్‌లోని తమ అనుబంధ సంస్థ ద్వారా గానీ అధీకృత ఏజెంట్‌ ద్వారా గానీ సీడీఎస్‌సీవోకు దరఖాస్తు చేసుకోవాలనిఆరోగ్య శాఖ తెలిపింది. ‘వ్యాక్సినేషన్‌లో వినియోగించటానికి ముందుగా సదరు విదేశీ టీకాను 100 మంది లబ్ధిదారులకు వేసి, వారం రోజుల పరిశీలన తర్వాత ప్రభుత్వ నిపుణుల కమిటీ వారి పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. ఆ టీకా రోగ నిరోధక శక్తి, భద్రతలను బేరీజు వేశాకే అనుమతి ఇస్తుంది’అని వివరించింది. సీడీఎస్‌సీవో ప్రోటోకాల్‌ ప్రకారం సదరు విదేశీ టీకాల ప్రతి బ్యాచ్‌ను కసౌలీలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ రీసెర్చి లేబొరేటరీ(సీడీఎల్‌) ద్వారానే విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా, యూకే, జపాన్‌ల్లో అత్యవసర వినియోగానికి అనుమతించిన కోవిడ్‌ టీకాలకు దేశంలో ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో అనుమతులివ్వాలని  కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు