గంభీర్‌ కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే

21 Sep, 2021 12:04 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కోవిడ్‌–19 మందులను అనధికారికంగా నిల్వ ఉంచారన్న కేసులో ట్రయల్‌ కోర్టు విచారణపై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించింది. గంభీర్‌తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. మందులను నిల్వ ఉంచిన ఫౌండేషన్‌లో వీరు ట్రస్టీలుగా ఉండటమే అందుకు కారణం. ఈ కేసుపై స్పందించాలని ఢిల్లీ డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది. అప్పటి వరకూ ప్రొసీడింగ్స్‌పై స్టే విధిస్తున్నట్లు స్పష్టంచేసింది.
(చదవండి: గౌతం గంభీర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు)

నిర్ణీత ధరకు మందులను అమ్మకుండా ఓ మెడికల్‌ క్యాంప్‌ ద్వారా ఉచితంగా వాటిని సరఫరా చేస్తున్నారని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్‌ ఏఎన్‌ఎస్‌ నడ్కర్ణి పేర్కొన్నారు. దీనిపై గంభీర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమానికి ఎలాంటి లైసెన్సులు అవసరం లేదని, ఇలాంటి కార్యక్రమాలపై క్రిమినల్‌ కేసులు పెట్టడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని చెప్పారు. తమ వద్దకు మొత్తం 2,600 స్ట్రిప్‌ల మందులు రాగా, కేవలం 16 రోజుల్లోనే 2,400 స్ట్రిప్‌లను ప్రజలకు అందించినట్లు పేర్కొన్నారు.

చదవండి: గౌతమ్ గంభీర్‌ను దోషిగా తేల్చిన డ్రగ్ కంట్రోలర్‌

మరిన్ని వార్తలు