Sonali Phogat Death: గోవా పోలీసుల నిర్లక్ష్యమే సోనాలి హత్యకు కారణమా?

2 Sep, 2022 08:20 IST|Sakshi

కీలక నిందితుల వ్యవహారాన్ని ముందే గుర్తించిన హెచ్‌– న్యూ

ఉస్మానియా వర్సిటీ ఠాణాలో నమోదైన కేసులో వాంటెడ్‌

అయినా పట్టించుకోని గోవాలోని అంజునా ఠాణా పోలీసులు

ఓ నిందితుడికి చెందిన పబ్‌లోనే చోటుచేసుకున్న దారుణం

పీటీ వారెంట్‌పై తీసుకువస్తాం: నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గోవాలోని అంజునా పోలీసుల నిర్లక్ష్యమే బీజేపీ నేత, టిక్‌ టాక్‌ స్టార్, టీవీ నటి సొనాలీ ఫోగట్‌ హత్యకు పరోక్ష కారణమైంది. ఆ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాలో గత నెలలో నమోదైన డ్రగ్స్‌ కేసులోనూ నిందితులుగా ఉన్నారు. దీనిపై అధికారిక సమాచారం ఇచ్చినా అంజునా పోలీసులు స్పందించలేదు. హైదరాబాద్‌ పోలీసులు ఆగస్టు 17న డ్రగ్స్‌ మాఫియాపై సమాచారం ఇవ్వగా.. 22 తెల్లవారుజామున ఫోగట్‌ హత్యకు గురి కావడం గమనార్హం. ఈ దారుణం జరిగిన పబ్‌ యజమాని సహా మరొకరు ఇక్కడి పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. వీరిద్దరినీ గత నెల 28న గోవా పోలీసులు అరెస్టు చేశారు. పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకువస్తామని గురువారం కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. 

ప్రీతీష్‌ విచారణతో వెలుగులోకి.. 
గోవాలోని అంజునా బీచ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్‌ దందా చేస్తున్న ఘరానా డ్రగ్‌ పెడ్లర్‌ ప్రీతీష్‌ నారాయణ్‌ బోర్కర్‌ను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌– న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడి విచారణలో అంజునా ప్రాంతానికే చెందిన స్టీవెన్, ఎడ్విన్‌ నూనిస్‌ సహా ఆరుగురి నుంచి డ్రగ్స్‌ దేశవ్యాప్తంగా చలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రీతీష్‌ను అరెస్టు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు ఆ కేసులో ఆరుగురినీ నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ కాపీ సహా ఇతర వివరాలను అంజునా పోలీసులకు పంపిన హైదరాబాద్‌ అధికారులు వారిని అరెస్టు చేయాల్సిందిగా కోరారు. 

నిందితులకే వత్తాసు.. 
దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్‌ దందాకు గోవా కీలకమన్నది జగమెరిగిన సత్యం. అక్కడి పోలీసుల సహకారంతోనే ఈ వ్యాపారం సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో నగరంలో దొరికిన ఓ వ్యక్తిని ప్రశ్నించగా.. గోవా నుంచి డ్రగ్‌ సరఫరా అయినట్లు తేలింది. దీంతో హెచ్‌– న్యూ టీమ్‌ అక్కడకు వెళ్లి ఆ సరఫరాదారు ఉన్న హోటల్‌పై దాడి చేసింది. ఫలితంగా అతడు చిక్కడంతో పాటు దాదాపు 100 గ్రాముల ఎండీఎంఏ రికవరీ అయింది.

దీనిపై హెచ్‌–న్యూ టీమ్‌ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని తీసుకురావడానికి సన్నాహాలు చేసింది. అక్కడకు వచ్చిన అంజునా పోలీసులు నిందితుడిని తీసుకువెళ్లడానికి వీల్లేదని, తామే అరెస్టు చూపిస్తామని పట్టుబట్టారు. ఆపై పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లాలని చెప్పి పంపారు. సీన్‌ కట్‌ చేస్తే ఆ నిందితుడు, దొరికిన సరుకు ఏమైందో ఇప్పటికీ హెచ్‌– న్యూకి సమాచారం ఇవ్వలేదు.  
చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ మృతిపై సీబీఐ దర్యాప్తు?

కిడ్నాప్‌ కేసులు పెడతామంటూ బెదిరింపు.. 
తమకు వాంటెడ్‌గా ఉన్న వారిని అరెస్టు చేయడానికి వెళ్తున్న సందర్భంలో హెచ్‌–న్యూ అధికారులు కొన్నిసార్లు గోవా పోలీసుల సహాయం కోరారు. అలా జరిగిన ప్రతిసారీ నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. దీంతో వారికి సమాచారం ఇవ్వకుండానే హెచ్‌–న్యూ ఆపరేషన్లు చేపట్టడం మొదలెట్టింది. ఓ సందర్భంలో అలా వచ్చి నిందితులను అరెస్టు చేసి తీసుకువెళితే కిడ్నాప్‌ కేసులు పెడతామంటూ హెచ్‌–న్యూ అధికారులనే గోవా పోలీసులు బెదిరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్టీవెన్, ఎడ్విన్‌ నూనిస్‌ల సమాచారాన్ని హెచ్‌–న్యూ గోవా పోలీసులకు అందించి అరెస్టు చేయమని కోరింది. ఎడ్విన్‌ అంజునా ప్రాంతంలో గ్రాండ్‌ లియోనీ రెసార్ట్, స్టీవెన్‌ హిల్‌ టాప్‌ పబ్‌ నిర్వహిస్తున్నారని, వీటిలో పని చేసే వారితోనే డ్రగ్స్‌ అమ్మిస్తున్నారని తెలిపింది. అయినప్పటికీ గోవా పోలీసులు పట్టించుకోలేదు. 

సొనాలీ హత్యలో ఆ ఇద్దరి పాత్ర.. 
సొనాలీ ఫోగట్‌ హత్య కేసులో ఎడ్విన్, స్టీవెన్‌ నిందితులుగా మారారు. ఈ హత్య గ్రాండ్‌ లియానీ రిసార్ట్‌లోని పబ్‌లోనే జరిగింది. ఆమెకు అధిక మోతాదులో డ్రగ్స్‌ ఇచ్చి చంపేశారు. ఆ మాదక ద్రవ్యాలను సరఫరా చేసింది ఎడ్విన్, స్టీవెన్‌గా తేలడంతో వారినీ నిందితులుగా చేర్చారు. ఎడ్విన్‌ను అరెస్టు చేసిన అంజునా పోలీసులు స్టీవెన్‌ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసులు సమాచారం ఇచ్చినప్పుడే స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

‘ఫోగట్‌ హత్య కేసులో అరెస్టు అయిన ఎడ్విన్‌ ఓయూ పరిధిలో నమోదైన ప్రీతీష్‌ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడిని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువస్తాం. డ్రగ్స్‌ కేసులో నిందితులను అరెస్టు చేయడానికి గోవా వెళ్లిన ప్రతిసారీ అక్కడి పోలీసుల నుంచి సహకారం లభించట్లేదు. అనేక సందర్భాల్లో నెగెటివ్‌ రిజల్ట్స్‌ వస్తున్నాయి. గోవా డ్రగ్‌ నెట్‌వర్క్‌పై హెచ్‌–న్యూకు ఉన్న సమాచారం గోవా పోలీసులకు ఎందుకు లేదంటూ అక్కడి పత్రికలూ రాస్తున్నాయి’ అని సీవీ ఆనంద్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు