Aryan Khan: ఆర్యన్‌ఖాన్‌ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు

27 Oct, 2021 08:54 IST|Sakshi

ఆర్యన్‌ దగ్గర డ్రగ్స్‌ దొరకలేదు, డ్రగ్స్‌ సేవించలేదు  

బాంబే హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు  

విచారణ నేటికి వాయిదా 

ముంబై: ముంబై తీరంలోని నౌకలో డ్రగ్స్‌ లభించిన కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌ కుమారుడైన ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. ఆర్యన్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, అతని వద్ద మాదక ద్రవ్యాలున్నట్టు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) దగ్గర ఆధారాలేవీ లేవని అతని తరఫు లాయర్లు ముకుల్‌ రోహత్గి, సతీష్‌ మానెషిండే  వాదనలు వినిపించారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.డబ్ల్యూ సాంబ్రె ఎదుట మంగళవారం రోజంతా ఆర్యన్‌ తరఫు లాయర్లు వాదించారు. ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణల అంశంలో కూడా ఆర్యన్‌కు ఎలాంటి ఫిర్యాదులు లేవని, అనవసర వివాదాల జోలికి అతను పోవడం లేదని లాయర్లు కోర్టుకు చెప్పారు. ఆ నౌకలో తక్కువ మొత్తంలో డ్రగ్స్‌ లభ్యమైనా ఎన్‌సీబీ అరెస్ట్‌లు చేసిందని నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టెన్సస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం ప్రకారం నవ యవ్వనంలో ఉన్న వారిని బాధితులుగా చూడాలే తప్ప, నిందితులుగా కాదని రోహత్గీ తన వాదనలు వినిపించారు.

ఆర్యన్‌ గతంలో మాదకద్రవ్యాలు సేవించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని , అతనొక యువకుడని పేర్కొన్నారు. ఆర్యన్‌ దగ్గర డ్రగ్స్‌ లభించలేదని, అతను మాదక ద్రవ్యాలను సేవించాడని  కూడా రుజువు కాలేదన్నారు. అర్బాజ్‌ వద్ద డ్రగ్స్‌ లభిస్తే అతని వెంట ఉన్న ఆర్యన్‌ని ఎలా అరెస్ట్‌ చేస్తారని రోహత్గి ప్రశ్నించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, అనవసర వివాదాలు తలెత్తి మీడియాలో ప్రాచుర్యం రావడం వల్ల ఈ కేసు పెద్దదిగా కనిపిస్తోందని, కానీ ఇది చాలా చిన్న కేసని రోహత్గి వాదించారు.
(చదవండి: వివాహేతర సంబంధం: పిల్లలకు నిప్పంటించి..)

ఆర్యన్‌తో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన అర్బాజ్‌ మర్చంట్, మున్‌మున్‌ ధమేచా బెయిల్‌ పిటిషన్‌పైనా ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ వాదనలు బుధవారం కొనసాగనున్నాయి. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మనీష్‌ రాజ్‌గరియా, అవిన్‌ సాహులకు మంగళవారం ప్రత్యేక ఎన్‌డీపీఎస్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.  2న ముంబై తీరంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న సమయంలో ఎన్‌సీబీ 20 మందిని అదుపులోనికి తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆ నౌకలో వీరిద్దరూ అతిథులుగా వచ్చారని ఎన్‌సీబీ చెప్పడంతో కోర్టు వారికి బెయిల్‌ ఇచ్చింది. మరోవైపు తన భర్త సమీర్‌ వాంఖెడే ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన భార్య, నటీమణి క్రాంతి రేడ్కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ ఎక్కువైందని మంగళవారం ఆమె విలేకరులకు తెలిపారు. భయపడుతూ బతికే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త నీతి, నిజాయతీ పరుడైన ప్రభుత్వ అధికారి అని ఆమె తెలిపారు.

ఫోన్ల అక్రమ ట్యాపింగ్‌: మాలిక్‌ 
ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్, ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న సమీర్‌ వాంఖెడే కొంతమంది ఫోన్లను అక్రమంగా ట్యాప్‌ చేశారని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ నవాబ్‌ మాలిక్‌ అల్లుడిని అరెస్ట్‌ చేసింది. అప్పట్నుంచి వాంఖెడేని లక్ష్యంగా చేసుకొని మాలిక్‌ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్నారు.

ముంబై, పుణెలోని ఇద్దరి వ్యక్తుల సాయంతో కొందరి ఫోన్లు అక్రమంగా ట్యాప్‌ చేశారని, పోలీసుల నుంచి కాల్‌ రికార్డులు తెప్పించుకున్నారని ఆరోపించారు. వాంఖెడే అవినీతి, అక్రమాలపై తనకు ఎందరో లేఖలు రాశారని, వాటిని ఎన్‌సీబీ డీజీ  దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. మరోవైపు వాంఖెడే ఢిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి 2 గంటల సేపు అక్కడే ఉన్నారు. 
(చదవండి: బైక్‌పై చిన్నారులుంటే.. వేగం 40 కి.మీ. మించరాదు)

>
మరిన్ని వార్తలు