సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. మద్యం మత్తులో దంపతులపై..

6 Oct, 2023 19:21 IST|Sakshi

లక్నో: ఇటీవలి కాలంలో విమానాల్లో కొందరు వ్యక్తులు తోటి ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు చూశాం. పక్కన వారితో మూత్ర విసర్జన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఇప్పుడు రైలులో చోటుచేసుకుంది.  సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు అభ్యంతరకంగా ప్రవర్తించాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. అయితే, యూపీకి చెందిన ఓ వృద్ధ దంపతులు ఢిల్లీ వెళ్లేందుకు గత బుధవారం సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. వీరు ఏసీ బోగీలో ప్రయాణిస్తుండగా షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు.. లోయర్‌ బెర్త్‌లో పడుకున్న ఆ దంపతులపై, వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో, వారు ఒక్కసారిగా షాకయ్యారు. 

మరోవైపు.. ఈ దారుణ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే కోచ్‌ అటెండెంట్‌, టీటీఈకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దంపతులకు సాయం చేశారు. అనంతరం.. ఘటనకు పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడిని ఢిల్లీకి చెందిన రితేశ్‌గా గుర్తించారు. మహోబాలో రైలెక్కిన అతడు అప్పటికే మద్యం తాగి ఉన్నాడని తోటి ప్రయాణికులు తెలిపారు. రితేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తలు