వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ ప్రారంభం

29 Dec, 2020 06:05 IST|Sakshi

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో నేడూ మాక్‌ డ్రిల్‌

న్యూఢిల్లీ : దేశవ్యాప్త కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుండగా సన్నాహకాల్లో భాగంగా సోమవారం డ్రై రన్‌ ప్రారంభమైంది. టీకా సరఫరా, పంపిణీ, వ్యాక్సినేషన్‌ మొదలుకొని ప్రతి అంశంపై పరిశీలన జరిపి, వాస్తవ వ్యాక్సినేషన్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో మొదలైన ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగనుంది. 

రెండు రోజుల ఈ కార్యక్రమం సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడ, గుజరాత్‌లోని గాంధీనగర్, రాజ్‌కోట్, పంజాబ్‌లోని లూధియానా, షహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ (నవాన్‌షహర్‌), అస్సాంలోని సోనిత్‌పూర్, నల్బరీ జిల్లాల్లో అమలైంది. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అందిన సూచనల మేరకు.. డ్రై రన్‌లో భాగంగా డమ్మీ వ్యాక్సిన్‌ను సెంట్రల్‌ స్టోరేజీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కోల్డ్‌ చైన్‌ పాయింట్లకు తరలించారు. ఈ వివరాలను కో విన్‌ యాప్‌లో నమోదు చేశారు. ప్రతి జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో 25 మందికి చొప్పున డమ్మీ వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఈ సమయంలో టీకా రవాణా సహా ప్రతి అంశానికి పట్టిన సమయాలను నమోదు చేశారు. కోవిడ్‌ కట్టడికి కేంద్ర హోం శాఖ గత∙మార్గదర్శకాల అమలును 2021 జనవరి 31 వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది

మరో 20 వేల కొత్త కేసులు
భారత్‌లో కొత్తగా మరో 20,021 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 97.82 లక్షలకు పెరిగిందని పేర్కొంది. 24 గంటల్లో మరో 279 మంది కోవిడ్‌తో మృతిచెందడంతో మరణాల సంఖ్య 1,47,901గా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 95.83%, మరణాల రేటు 1.45%గా ఉంది. వరుసగా ఏడో రోజు కూడా యాక్టివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలకు లోపే నమోదైంది.  16,88,18,054 శాంపిళ్లను పరీక్షించారు.

మరిన్ని వార్తలు