వచ్చే వారమే డ్రై రన్‌

26 Dec, 2020 03:00 IST|Sakshi

ఏపీ సహా నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు యంత్రాంగం సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈ నెల 28, 29వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అస్సాం, గుజరాత్‌ రాష్ట్రాల్లో కేంద్రం మాక్‌డ్రిల్‌ చేపట్టనుంది. టీకా లేకుండానే చేపట్టే ఈ ‘డ్రై రన్‌’ అచ్చంగా వ్యాక్సినేషన్‌ మాదిరిగానే ఉంటుంది. ఒక్కో రాష్ట్రం నుంచి రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని జిల్లా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం/కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ప్రైవేట్‌ ఆస్పత్రులు వంటి ఐదు విభాగాల్లో వ్యాక్సినేషన్‌ సన్నద్ధతను అంచనా వేయనుంది.

‘వ్యాక్సిన్‌ సరఫరా, కేటాయింపులు, పరీక్షలు, సిబ్బంది మోహరింపు, ‘డ్రై రన్‌’ చేపట్టే చోట ఏర్పాట్లు, మాక్‌ డ్రిల్‌ సమయంలో భౌతిక దూరం వంటి ముందు జాగ్రత్తలను పాటించడం, నివేదికల తయారీ, సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం వివరాలను ‘కో విన్‌’ సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ‘యంత్రాంగం సమీకరణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరీక్షించడం, క్షేత్రస్థాయిలో ‘కో విన్‌’ వినియోగం, ప్రణాళిక, అమలు, ఎదురయ్యే సవాళ్లు, వాస్తవ కార్యాచరణకు చేపట్టాల్సిన చర్యలను ఈ కార్యక్రమంలో గుర్తిస్తాం’ అని ఆరోగ్య శాఖ తెలిపింది.

వివిధ స్థాయిల్లో అధికారుల అనుభవాలను కూడా సమీక్షిస్తామని వివరించింది. వ్యాక్సినేషన్‌ సందర్భంగా ఏమైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపింది.  వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై వివిధ రాష్ట్రాలకు చెందిన 7 వేల మంది జిల్లా స్థాయి ట్రైనర్లకు శిక్షణ ముగిసిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 17,831 బ్లాకులకు గాను 1,399 బ్లాకుల్లో వ్యాక్సినేషన్‌ బృందాలకు శిక్షణ పూర్తయిందనీ, మిగతా బ్లాకుల్లో శిక్షణ పురోగతిలో ఉందని తెలిపింది.   

ధారావిలో కొత్త కేసులు సున్నా
ముంబై: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబైలోని ధారావి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మొన్నటి వరకు ప్రపంచంలోని కోవిడ్‌ హాట్‌స్పాట్లలో ఒకటిగా ఉన్న ధారావిలో  గత 24 గంటల్లో ఒక్క కొత్త కరొనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఏప్రిల్‌ ఒకటి తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ మొత్తం 3,788 కేసులు నమోదు కాగా, 3,464 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ యాక్టివ్‌ కేసులు 12 మాత్రమే. సుమారు రెండున్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ మురికి వాడలో లక్షలాదిగా జనం నివసిస్తున్నారు.


కొత్త కేసులు 23,067
దేశంలో కొత్తగా మరో 23,067 కోవిడ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 1,01,46,845కు చేరుకోగా కోలుకుని వారి సంఖ్య 97లక్షలు దాటింది. 24 గంటల్లో మరో 336 మంది కోవిడ్‌తో చనిపోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,47,092గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 97,17,834 మంది కోలుకోగా రికవరీ రేటు 95.77%కి చేరుకుంది. 

మరిన్ని వార్తలు