డక్‌డక్‌గో సెర్చ్‌ ఇంజిన్‌ వైపు నెటిజన్ల మొగ్గు

20 Jan, 2021 16:23 IST|Sakshi

పది కోట్లకు చేరుకున్న డక్‌డక్‌గో సెర్చ్‌ క్వెరీస్‌ 

ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్న యూజర్లు    

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాల్లో ఒకే కంపెనీ ఆధిపత్యం ఇక ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. రోజువారీ జీవితంలో భాగమైన వాట్సాప్‌ వంటి యాప్‌లనే ప్రైవసీ పాలసీ అప్‌డేట్స్‌ కారణంగా పక్కనపెడుతున్న యూజర్లు.. ప్రైవసీకి పెద్దపీట వేసే ఇంటర్నెట్‌ సాధనాలు, సోషల్‌మీడియా యాప్‌ల వైపు దృష్టి సారించారు. వాట్సాప్‌ను కాదని సిగ్నల్‌ వైపు మళ్లినట్టే నెటిజన్లు సెర్చ్‌ ఇంజిన్‌కూ ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. తమ డేటా ప్రొఫైల్‌ను వినియోగించి వ్యాపారం చేసే సెర్చ్‌ ఇంజిన్లను కాదని ప్రైవసీ అందించే సెర్చ్‌ ఇంజిన్ల వైపు మళ్లుతున్నారు. తాజాగా డక్‌డక్‌గో సెర్చ్‌ ఇంజిన్‌కు యూజర్లు పెరుగుతుండడం ఈ కొత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. 

గూగుల్‌కు పోటీ ఉందా? 
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో రోజుకు 350 కోట్ల సెర్చ్‌ క్వెరీస్‌ నమోదవుతున్నట్టు అంచనా. అంటే 350 కోట్ల ప్రశ్నలు గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను రోజూ పలుకరిస్తున్నాయి. సెర్చ్‌ ఇంజిన్ల వాడకంలో 90 శాతం వాటా గూగుల్‌దే. మిగిలిన సెర్చ్‌ ఇంజిన్లు బింగ్‌ (2.78 శాతం వాటా), యాహూ (1.60 శాతం), బైదు (0.92 శాతం), యాండెక్స్‌ (0.85 శాతం), డక్‌డక్‌గో (0.50 శాతం) బరిలో ఉన్నాయి. అయితే ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రైవసీ మీద చర్చ జరుగుతుండడంతో యూజర్ల డేటా సేకరించే యాప్‌ల వాడకాన్ని వినియోగదారులు తగ్గిస్తున్నారు. ఇదే సమయంలో డక్‌డక్‌గో సెర్చ్‌ ఇంజిన్‌లో సెర్చ్‌ క్వెరీస్‌ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా రోజుకు 10 కోట్ల సెర్చ్‌ క్వెరీస్‌ మైలురాయిని డక్‌డక్‌గో అందుకుంది. ఇందుకు కారణంగా డక్‌డక్‌గో ప్రైవసీకి పెద్దపీట వేస్తుంది. యూజర్ల ఐపీ అడ్రస్‌ వంటివి ఇది సేకరించదు. నిజానికి గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు వచ్చే క్వెరీస్‌తో పోల్చితే ఇది చాలా తక్కువ. కానీ క్రమంగా పెరుగుతున్న క్వెరీస్‌ సంఖ్యను బట్టి డక్‌డక్‌గోకు ఆదరణ పెరుగుతోందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

డక్‌డక్‌గో ఎందుకు? 
ఇతర సెర్చ్‌ ఇంజిన్లకు తాము భిన్నమని, అవి తనకు వచ్చే సెర్చ్‌ క్వెరీల ఆధారంగా యూజర్‌ను ట్రాక్‌ చేస్తాయని, భారీ అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీని కలిగి ఉన్న సెర్చ్‌ ఇంజిన్లు.. అడ్వర్టయిజర్లను ఆకర్షించుకునేందుకు యూజర్ల డేటా వాడుకుంటున్నాయని, కానీ తాము వాటికి దూరంగా ఉంటామని డక్‌డక్‌గో చెబుతోంది. సెర్చ్‌ ఇంజిన్లలో ఇచ్చే క్వెరీ ఆధారంగా థర్డ్‌ పార్టీ సోషల్‌ మీడియా యాప్‌లలో యాడ్స్‌ ప్రత్యక్షమవుతాయని చెబుతోంది. కానీ యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేసేలా తాము బిజినెస్‌ మోడల్‌ను ఉపయోగిస్తున్నామని చెబుతోంది. సాధారణంగా మనం బ్రౌజ్‌ చేసే వెబ్‌సైట్లు మాత్రమే కాకుండా థర్డ్‌ పార్టీ ట్రాకర్లు మన బ్రౌజింగ్, లొకేషన్, సెర్చ్, కొనుగోళ్ల వివరాలు సేకరించి మన బిహేవియరల్‌ ప్రొఫైల్‌ను సిద్ధంచేసుకుంటాయి. తద్వారా మనకు వ్యాపార ప్రకటనలు సూచిస్తాయి.

పెద్ద సెర్చ్‌ ఇంజిన్లు, సోషల్‌ మీడియా యాప్‌లు యూజర్లను ట్రాక్‌ చేస్తూ తమ యాడ్‌ నెట్‌వర్క్‌ కోసం డేటాను వినియోగిస్తున్నాయని చెబుతోంది. తమ సెర్చ్‌ ఇంజిన్‌లో ఉన్న ప్రైవసీ ఎసెన్షియల్స్‌ను వాడడం వల్ల థర్డ్‌ పార్టీ ట్రాకర్లు పనిచేయవని డక్‌డక్‌గో చెబుతోంది. తాము కేవలం యూజర్లు ఇచ్చే క్వెరీ ఆధారంగా యాడ్‌ చూపిస్తామని, కానీ యూజర్‌ బ్రౌజింగ్‌ ఆధారంగా బిహేవిరియల్‌ యాడ్స్‌ ఉండవని చెబుతోంది. అలాగే ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌(ఐఎస్‌పీ) నుంచి నిఘా కూడా ఉండదని చెబుతోంది. ఐఎస్‌పీ నుంచి నిఘా ఉంటే.. మన బ్రౌజింగ్‌ డేటాను అది వినియోగించుకోవడం, అమ్ముకోవడం చేస్తుందని హెచ్చరిస్తోంది. తాము ఐపీ అడ్రస్‌ను కూడా సేకరించమని చెబుతోంది. 

ఫేస్‌బుక్‌ డేటా సేకరణపైనా చర్చ.. 
ఫేస్‌బుక్‌ గత ఏడాది తెచ్చిన కొత్త ఫీచర్‌ ఆధారంగా యూజర్లు ఫేస్‌బుక్‌పై కాకుండా ఇతరత్రా బ్రౌజింగ్‌ చేసినా ఆ యాక్టివిటీని సేకరిస్తోంది. ఫేస్‌బుక్‌ సెటింగ్స్‌లోకి  వెళ్లి ‘ఆఫ్‌–ఫేస్‌బుక్‌ యాక్టివిటీ’ని క్లిక్‌ చేసి, మళ్లీ ‘మేనేజ్‌ యువర్‌ ఆఫ్‌–ఫేస్‌బుక్‌ యాక్టివిటీ’ని క్లిక్‌ చేసి, అందులో ఉండే ‘మేనేజ్‌ ఫ్యూచర్‌ యాక్టివిటీ’లో టర్న్‌ ఇట్‌ ఆఫ్‌ అని నొక్కితే యాక్టివిటీ డేటాను సేకరించడం ఆపుతుంది. దీని వల్ల మనకు యాడ్స్‌ అంతేసంఖ్యలో కనిపించినప్పటికీ.. అవి మన యాక్టివిటీని బట్టి ఉండవు. కానీ మన ఫేస్‌బుక్‌ ఖాతా, ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో యాక్టివిటీని బట్టి యాడ్స్‌ కనిపిస్తాయి. ఇటీవల వాట్సాప్‌ ప్రైవసీ అప్‌డేట్స్‌పై భారీఎత్తున చర్చ జరిగిన సందర్భంలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ‘ఆఫ్‌–ఫేస్‌బుక్‌ యాక్టివిటీ’పై కూడా చర్చ జరుగుతోంది. యూజర్ల డేటాను యాప్‌లు తమ వాణిజ్య కార్యకలాపాల్లో వినియోగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలోనే యూజర్లు ప్రైవసీకి పెద్దపీట వేసే సోషల్‌ మీడియా యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు.

మరిన్ని వార్తలు