Dussehra 2022: సమగ్ర జనాభా విధానం కావాలి

7 Oct, 2022 06:30 IST|Sakshi

అన్ని వర్గాలకు సమానంగా వర్తించాలి: భగవత్‌

నాగపూర్‌: దేశంలో అన్ని వర్గాలకు సమానంగా వర్తించే ఒక సమగ్ర జనాభా విధానాన్ని (పాపులేషన్‌ పాలసీ) రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ అన్నారు. విస్తృతమైన చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ విధానాన్ని తయారు చేయాలని చెప్పారు.  నాగపూర్‌లో బుధవారం నిర్వహించిన దసరా వేడుకల్లో మోహన్‌ భగవత్‌ మాట్లాడారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది చాలా కీలకమైన అంశమని, దీన్ని విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనాభా అసమతుల్యత అనేది దేశ భౌగోళిక సరిహద్దులను సైతం మార్చేస్తుందని వ్యాఖ్యానించారు.

వివిధ వర్గాల జనాభా మధ్య సమతుల్యత కోసం అన్ని వర్గాలకు సమానంగా వర్తించే నూతన జనాభా విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. దేశంలో వర్గాల మధ్య సమతుల్యత ఉండాలన్నారు. ‘‘జననాల రేటులో భేదాలు, బలవంతపు మత మార్పిడులు, ప్రలోభాలు, అత్యాశ కారణంగా మతాలు మారడం, దేశంలోకి అక్రమ చొరబాట్లు.. ఇలాంటివన్నీ ముఖ్యమైన అంశాలు. వీటిని కచ్చితంగా అరికట్టాలి’’ అని మోహన్‌ భగవత్‌ సూచించారు. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఆంగ్ల భాష ఒక్కటే ముఖ్యం కాదని తెలిపారు.

మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాతృభాషను ప్రభుత్వమే ప్రోత్సహించాలని మనం ఆశిస్తున్నామని, అదే సమయంలో మనం సంతకం మాతృభాషలోనే చేస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలని హితవు పలికారు. మన ఇళ్లపై నేమ్‌ప్లేట్లు మాతృభాషలోనే ఉంటున్నాయా? అని ఏదైనా ఆహ్వానం పంపేటప్పుడు మాతృభాషలోనే పంపిస్తున్నామా? అని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలని ప్రయత్నించేటప్పుడు చైనాలో ఏం జరుగుతోందో చూడాలని చెప్పారు.

‘ఒక కుటుంబం, ఒక బిడ్డ’ విధానం వల్ల చైనా వృద్ధ దేశంగా మారుతోందన్నారు. భారతదేశ జనాభాలో 57 శాతం మంది యువతే ఉన్నారని, మరో 30 ఏళ్లపాటు మన దేశం యువదేశంగానే కొనసాగుతుందని మోహన్‌ భగవత్‌ ఉద్ఘాటించారు. 50 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి? ఇప్పటి యువత వృద్ధులుగా మారుతారు, వారందరి ఆకలి తీర్చేటంత ఆహారం మనవద్ద ఉంటుందా? అని ఆన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలు ప్రారంభించాలని, స్వయం ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. అందరికీ ఉద్యోగాలిచ్చే శక్తి ప్రభుత్వాలకు ఉండదన్నారు. 

మరిన్ని వార్తలు