చైనా సరిహద్దుల్లో రాజ్‌నాథ్‌ ఆయుధ పూజ

25 Oct, 2020 10:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విజయదశమి సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌  సింగ్‌ ఆదివారం ఉదయం  ఆయుధ పూజ నిర్వహించారు. వాస్తవాధీన రేఖకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సిక్కిం షెరాథాంగ్‌ వద్ద ఆయన సైనికులతో  ‘శాస్త్ర పూజ’  చేశారు.  ఆయుధాలు, పరికరాలు, సాయుధ వాహనాలను పూజించారు. అనంతరం సైనికులతో రాజ్‌నాథ్‌ ముచ్చటించారు.  దసరా సందర్భంగా వారికి తన శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దుల రక్షణలో సేవలు చేస్తున్న వారి అంకితభావాన్ని ప్రశంసించారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని ప్రశంసలు కురిపించారు. ఇక  చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ సైనికులతో గడపటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ... చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న వివాదం త్వరగా ముగిసిపోవాలని భారత్‌ కోరుకుంటోందని ఆకాంక్షించారు. శాంతి నెలకొల్పడమే తమ ఉద్ధేశ్యమని, ఈ విషయంలో తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ఆకాంక్షించారు. భారత జవాన్లు దేశంలోని ఒక్క ఇంచు భూమిని కూడా ఇతరుల చేతుల్లోకి పోనివ్వరని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.  అంతకు ముందు తన ప‌ర్య‌ట‌నలో భాగంగా డార్జిలింగ్‌లోని సుక్నా యుద్ధ స్మార‌కాన్ని ఆయన, ఆర్మీ ఛీప్ ఎంఎం న‌ర‌వాణేతో క‌లిసి సంద‌ర్శించారు. యుద్ధ స్మారకం వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించారు.

కాగా ఇవాళ ఉదయం రక్షణమంత్రి ట్విటర్‌లో దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘విజయదశమి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా ఈ రోజు సిక్కింలోని నాథులా ప్రాంతాన్ని సందర్శించి భారత సైన్యం సైనికులను కలుస్తా. ఆయుధ ఆరాధన కార్యక్రమంలో కూడా పాల్గొంటా’ అని ట్వీట్‌ చేశారు. గత ఏడాది ఫ్రాన్స్‌ ఓడరేవు నగరం బోర్డాలో రక్షణ మంత్రి రాఫేల్ యుద్ధ విమానాలకు శాస్త్ర పూజ నిర్వహించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా