Earthquake: పంజాబ్‌లో భూకంపం. వారంలో మూడోసారి.. వణికిపోతున్న ఉత్తరాది

14 Nov, 2022 07:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తర భారతం మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. పంజాబ్‌లో సోమవారం వేకువ ఝామున భూమి కంపించింది. కొన్నిసెకన్లపాటు భూమి కంపించడంతో జనాలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.1గా ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. 

అమృత్‌సర్‌ సమీపంలో రాత్రి 3గం.42నిమిషాల ప్రాంతంలో 120 కిలోమీటర్ల భూకేంద్రంగా భూమి కంపించిందని తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. రాత్రంతా రోడ్ల మీద జాగం చేశారు. ఇదిలా ఉంటే.. గత వారంలో ఇలా ఉత్తర భారతాన‍్ని భూమి వణికించడం ఇది మూడోసారి.

తాజాగా ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో బుధ, శనివారాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. నేపాల్‌ భూకంప ప్రభావంతో(6.3 తీవ్రత) నవంబర్‌ 9న ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఇంకా పలు చోట్ల భూమి కంపించగా.. నవంబర్‌ 12వ తేదీన నేపాల్‌ భూకంప ప్రభావం(5.4 తీవ్రత) మరోసారి ఉత్తర భారతంలో చూపించింది. అయితే తక్కువ తీవ్రతతో నమోదు అవుతున్న వరుస ప్రకంపనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు.

మరిన్ని వార్తలు