ECI: చిరాగ్, పారస్‌లకు వేర్వేరు ఎన్నికల గుర్తులు

6 Oct, 2021 07:43 IST|Sakshi

కొత్త గుర్తులు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ: చీలికతో వివాదంగా మారిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) సమస్యకు కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక పరిష్కారం చూపింది. ఇంతకాలం వినియోగంలో ఉన్న పార్టీ పేరు, పార్టీ ఎన్నికల గుర్తు(ఇల్లు గుర్తు)ను చీలిక వర్గాలైన చిరాగ్‌ పాశ్వాన్, పశుపతి కుమార్‌ పారస్‌లు వాడొద్దని గతంలోనే ఈసీ ఆదేశాలివ్వడం తెల్సిందే. తాజాగా ఇరు వర్గాలకు వేర్వేరు పేర్లు, ఎన్నికల గుర్తులు కేటాయించింది. చిరాగ్‌ పాశ్వాన్‌ వర్గానికి ‘లోక్‌ జనశక్తి పార్టీ(రాం విలాస్‌)’ పేరును, హెలికాప్టర్‌ గుర్తును కేటాయిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.

పారస్‌ వర్గానికి ‘రాష్ట్రీయ లోక్‌ జన శక్తి’ పేరును, ఎన్నికల గుర్తుగా ‘కుట్టుమిషన్‌’ను ఇస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఉప ఎన్నికల్లో ఈ పేర్లు, గుర్తులను వాడుకోవచ్చని ఈసీ ఇరు వర్గాలకు వేర్వేరుగా లేఖలు రాసింది. ‘‘ బిహార్‌లో ఉప ఎన్నికల కోసం ఏ ఇతర పార్టీకి కేటాయించని ‘గుర్తుల జాబితా’లో ఉన్నవేవైనాకావాలంటే మీరు వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. కానీ, మీ రెండు వర్గాల గుర్తులు ఒకేలా మాత్రం ఉండకూడదు’’ అని ఈసీ స్పష్టంచేసింది.  

 

మరిన్ని వార్తలు