ఈసీ కార్యాచరణ: దూసుకొస్తున్న మరో ఎన్నికల సంగ్రామం

28 Jul, 2021 18:55 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారనున్నాయి. త్వరలోనే మినీ సంగ్రామానికి రంగం సిద్ధమవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాచరణ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. తదనుగుణంగా ఓటర్ల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు చేశారు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేశారు. కొన్ని నెలల ముందు జరిగిన ఎన్నికల నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్ధమవ్వాలని భావిస్తోంది. కరోనా రెండో దశ వ్యాప్తికి దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టడాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల అధికారుల నుంచి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల అనుభవాలతో వచ్చే ఎన్నికలను నిర్వహిద్దామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర సూచించారు. షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేద్దామని తెలిపారు. 

మరిన్ని వార్తలు