25% ఓటర్లు 30 ఏళ్లలోపు వారే

19 Jun, 2021 05:14 IST|Sakshi

2019 ఎన్నికలపై అట్లాస్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో 18 నుంచి 29 ఏళ్ల వయస్సు వారు నాలుగో వంతు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆవిష్కరించిన అట్లాస్‌ వెల్లడించింది. 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికల విశేషాలతో రూపొందించిన ఈ అట్లాస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్‌ కుమార్, అనూప్‌ చంద్ర పాండే ఈనెల 15న విడుదల చేశారు.  17వ లోక్‌సభ కోసం జరిగిన 2019 సాధారణ ఎన్నికలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ.  

అట్లాస్‌లో పొందుపరిచిన ముఖ్యాంశాలు
► మొత్తం 543 నియోజకవర్గాల్లో 8,054 మంది పోటీ చేయగా, అందులో 726 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు. 78 మంది మహిళా అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు.
► అత్యధికంగా 185మంది అభ్యర్థులు పోటీపడిన నియోజకవర్గం నిజామాబాద్‌. అత్యల్పంగా ముగ్గురు మాత్రమే పోటీ చేసిన నియోజకవర్గం తుర(మేఘాలయ).  
► వయస్సు పరంగా చూస్తే 18–29 ఏళ్ల మధ్య 25.37 శాతం ఓటర్లు ఉన్నారు. ఈ విభాగంలో అత్యధికంగా మిజోరాంలో 39.77 శాతం, అత్యల్పంగా కేరళలో 20.16 శాతం,  తెలంగాణలో 26.08% ఉన్నారు.
► 30–59 మధ్య వయస్సు వారు దేశవ్యాప్త ఓటర్లలో 59.77% ఉన్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీలో అత్యధికంగా ఈ కేటగిరీలో 62.14% కాగా, తెలంగాణలో 61.37% మంది ఉన్నారు.
► 60–79 ఏళ్ల మధ్య వారు మొత్తం ఓటర్లలో 13.15 శాతం ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారు మొత్తం ఓటర్లలో 1.71 శాతం  ఉన్నారు.  
► అత్యధిక ఓటర్లు కలిగిన టాప్‌–5 నియోజకవర్గాల్లో మొదటిస్థానంలో మల్కాజిగిరి ఉండగా, ఐదో స్థానంలో చేవెళ్ల నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లోనే సుమారు 56 లక్షల ఓటర్లు ఉన్నారు.  
► అత్యల్పంగా పోలైన ఓట్ల శాతం నమోదైన 10 నియోజకవర్గాల్లో తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.
► లింగ నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. అత్యధికంగా పుదుచ్చేరిలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,118 మంది మహిళా ఓటర్లు ఉండగా, ఏపీలో 1,018మంది, తెలంగాణలో 990 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు