ప్రముఖ ఆర్థికవేత్త కన్నుమూత

26 Sep, 2020 18:45 IST|Sakshi

మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా సతీమణి కన్నుమూత

న్యూఢిల్లీ: పద్మ భూషణ్‌ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త‌ డాక్టర్‌ ఇషర్‌ జడ్జ్‌ అహ్లువాలియా(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్‌తో పోరాడిన ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. కాగా ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి పవన్‌, అమన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇషర్‌ జడ్జ్‌ అహ్లువాలియా ఐసీఆర్‌ఐఈఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ రిలేషన్స్‌)‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. విద్య, సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి గానూ 2009లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది.(చదవండి: కోవిడ్‌ వ్యాక్సిన్‌: రూ. 80 వేల కోట్లు ఉన్నాయా?!)

కాగా ఇషర్‌ జడ్జ్‌ అహ్లువాలియా మరణం పట్ల మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అహ్లువాలియా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆర్థికవేత్త, తన హయాంలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా ఆమె ఎనలేని కృషి చేశారని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కొనియాడారు. ఇక బయోకాన్‌ ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా అహ్లువాలియాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఎంతో ప్రతిభావంతురాలైన తన స్నేహితురాలు ఈ లోకాన్ని వీడి వెళ్లారన్నారు. ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాన్సర్‌తో పోరాడి ఓడిన శ్రీమతి అహ్లువాలియా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌, భారత విదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమ్‌ మీనన్‌ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. (కరోనాతో అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్ మృతి)

మరిన్ని వార్తలు