Teacher Recruitment Scam: ‘ఆ మంత్రి డాన్‌లా ప్రవర్తిస్తున్నారు’

25 Jul, 2022 08:20 IST|Sakshi

ఆస్పత్రిలో మంత్రి పార్థా ఛటర్జీ వైఖరిపై కలకత్తా హైకోర్టుకు తెలిపిన ఈడీ 

కోల్‌కతా: స్కూల్‌ టీచర్ల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ ఆసుపత్రిలో ఒక డాన్‌లాగా ప్రవర్తిస్తున్నాడని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కలకత్తా హైకోర్టుకు తెలియజేసింది. చట్టం నుంచి తప్పించుకొనేందుకు అనారోగ్యం అంటూ నాటకాలు ఆడుతున్నాడని ఆక్షేపించింది. పార్థా ఛటర్జీని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బిబేక్‌ చౌదరి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.

ఈడీ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. నిందితుడు అధికార బలం ఉన్న వ్యక్తి అని, కోల్‌కతా ఆసుపత్రిలో మహారాజులాగా చెలరేగిపోతున్నాడని విన్నవించారు.  ఆయనను ఎస్‌ఎస్‌కేఎం హాస్పిటల్‌ నుంచి ఎయిమ్స్‌కు తరలిస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పార్థా చటర్జీని ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు సోమవారం ఎయిర్‌ అంబులెన్స్‌లో తీసుకెళ్లాలని ఈడీని ఆదేశించారు. ఇదే కుంభకోణంలో అరెస్టయిన పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఆమెను ఒక్కరోజుపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, బెంగాల్‌ మంత్రి పార్థా చటర్జీని ఈడీ అధికారులు ఈ నెల 23న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కోల్‌కతాలో అర్పితా ముఖర్జీ నివాసంలో రూ.21 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: టీచర్ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో బెంగాల్‌ మంత్రి అరెస్ట్‌.. అసలు సినిమా ముందుంది: బీజేపీ

మరిన్ని వార్తలు