ఈడీ దాడులు: నిబంధనలు ఉల్లంఘించి.. 4 వేల కోట్లు దేశం దాటించారు

24 May, 2023 20:47 IST|Sakshi

న్యూఢిల్లీ: గేమింగ్ యాప్‌ల ద్వారా ఫారెక్స్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దేశంలోని 25 చోట్ల సోదాలు నిర్వహించింది. వస్తువులు సేవల దిగుమతి కోసం చెల్లింపుల ముసుగులో రూ. 4000 కోట్ల నిబంధనలు పాటించకుండా దేశం దాటించినట్లు ఈడీ పేర్కొంది.

ఫెమా, 1999 నిబంధనల ప్రకారం ఢిల్లీ (11), గుజరాత్ (7), మహారాష్ట్ర (4), మధ్యప్రదేశ్ (2), ఆంధ్రప్రదేశ్ (1)లో విదేశీ రిజిస్టర్డ్ కంపెనీలపై జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించి సోదాలు జరుగుతున్నట్లు ఈడీ తెలిపింది. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ విదేశీ-రిజిస్టర్డ్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లతో పాటు దేశంలో పనిచేస్తున్న కంపెనీలపై వివిధ చోట్ల దాడులు నిర్వహించిన తర్వాత సుమారు రూ. 4,000 కోట్ల అక్రమ విదేశీ చెల్లింపులను గుర్తించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం తెలిపింది.

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ప్రకారం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 55 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడమే కాకుండా రూ.19.55 లక్షలు, 22,600 డాలర్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

చదవండి: రెండేళ్ల ప్రేమ, పెళ్లి మండపం నుంచి వరుడు పరార్‌.. పెళ్లి బట్టలతోనే రంగంలోకి నవ వధువు, ఏం చేసిందంటే...

మరిన్ని వార్తలు