ప్రతిపక్షాల ఆరోపణలు.. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలు వెల్లడించిన ఈడీ

17 Mar, 2023 04:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ). విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్పష్టంచేసింది.

అయితే మనీలాండరింగ్‌ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం, ఫారెన్‌ ఎక్సే్ఛంజ్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్‌ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదలచేసింది.

ఈడీ గణాంకాల ప్రకారం...
► మనీ లాండరింగ్‌ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌– ఎఫ్‌ఐఆర్‌ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి.  
► అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్‌చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది.  
► 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు.   
► మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్‌మెంట్‌కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది.
► ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి.
► ఎఫ్‌ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు