ఫోన్ల వాడకంపైనే ప్రశ్నలు!

22 Mar, 2023 02:10 IST|Sakshi

వరుసగా రెండోరోజూ కవితను విచారించిన ఈడీ

తక్కువ కాలంలో ఎక్కువ ఫోన్లు ఎందుకు వినియోగించారు?

ఏ ఫోను ఎప్పుడు వినియోగించారు? అంటూ..ప్రశ్నలు

ఉదయం 11.30కు వెళ్లి రాత్రి 9.40 వరకు అక్కడే..

తాజాగా 10 ఫోన్లు ఈడీకి అందజేసిన ఎమ్మెల్సీ

క్లోనింగ్‌ కోసం పంపిన అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వరసగా రెండోరోజు మంగళవారం కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు అంశాలపై సుమారు పది గంటల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు. ప్రధానంగా పది ఫోన్లు వినియోగించారన్న ఆరోపణలపై కవితను ప్రశ్నించినట్లు సమాచారం.

మంగళవారం ఉదయం 11.30 గంటలకు తుగ్లక్‌ రోడ్‌లోని నివాసం నుంచి భర్త అనిల్‌ వెంట రాగా బయటకు వచ్చిన కవిత.. మీడియాకు విజయ సంకేతం చూపుతూ ఈడీ కార్యాలయానికి బయలు దేరారు. ఈడీ తన చార్జిషీటులో కవిత 6209999999 నంబరును ఆరు వేర్వేరు ఐఎంఈఐ నంబర్లున్న ఆరు ఫోన్లలో, 8985699999 నంబరును నాలుగు వేర్వేరు ఐఎంఈఐ నంబర్లున్న నాలుగు ఫోన్లలో వినియోగించారని ఆరోపించింది. దీంతో ఆ పది ఫోన్లను కవిత మంగళవారం ఈడీకి అందజేశారు.

మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ అగ్రశ్రేణి నేతలతో కవిత సంభాషించారని, పాలసీ విధానం ముందుగానే వాట్సాప్‌లో లీకయిందన్న ఆరోపణల నేపథ్యంలో కవిత ఫోన్లు పరిశీలించే నిమిత్తం వాటిని తీసుకురావాలని కోరినట్లు తెలిసింది. కాగా కవిత నుంచి తీసుకున్న ఫోన్లను క్లోనింగ్‌ నిమిత్తం పంపినట్లు సమాచారం. 

మూడు వాంగ్మూలాలపై సంతకాలు
దర్యాప్తు అధికారి జోగిందర్, ఓ మహిళా అధికారి సహా మరో ముగ్గురు అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. ఏ ఫోనును ఎప్పుడు వినియోగించారు? ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వినియోగించారు? తక్కువ కాలంలో ఎక్కువ ఫోన్లు వినియోగించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అనే కోణంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

మొత్తం మూడుసార్లు విచారణ సందర్భంగా మూడు వాంగ్మూలాలు నమోదు చేసిన ఈడీ అధికారులు వాటిపై కవితతో పాటు ఆమె న్యాయవాది సంతకాలు కూడా తీసుకున్నట్టు సమా చారం. ఇలావుండగా ఇంతకుముందే ఒక ఫోన్‌ను ఈడీకి ఇచ్చిన కవిత.. ఈరోజు 10 ఫోన్లు ఇవ్వడంతో మొత్తం 11 ఫోన్లు ఇచ్చినట్టయ్యింది.

నేడు విచారణ లేనట్టేనా?
విచారణ అనంతరం రాత్రి 9.40 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. పిడికిలి ఎత్తి, విజయ సంకేతం చూపుతూ, చిరునవ్వుతో శ్రేణులకు అభివాదం చేస్తూ నివాసానికి చేరుకున్నారు. తదుపరి విచారణ తేదీని ఈడీ ఇంకా ప్రకటించలేదు. అయితే బుధవారం విచారణకు రమ్మనలేదని బీఆర్‌ఎస్‌ శ్రేణులు తెలిపాయి.

ఈడీ కార్యాలయానికి భరత్‌
కవితను విచారిస్తున్న సమయంలోనే బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కవిత విజ్ఞప్తి మేరకే ఈడీ అధికారులు భరత్‌ను పిలిచినట్లు తెలిసింది. అయితే కవిత తరఫున తదుపరి విచారణలో పాల్గొనడానికి సంబంధించిన ప్రక్రియ నిమిత్తం పిలిచారా? లేక కవిత న్యాయవాది సమక్షంలో సమాధానాలు చెబుతానంటే పిలిచారా? అనేది తెలియలేదు.   
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు