నిన్న బీజేపీపై కామెంట్స్‌.. నేడు మంత్రిని విచారిస్తున్న ఈడీ

23 Feb, 2022 12:52 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. నిన్నటి వరకు  బీజేపీ, శివసేన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇంతలోనే బుధవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ను మనీలాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం బుధవారం ఉదయం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. ముంబై అండర్ వరల్డ్ డాన్‌ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మాలిక్‌కు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నవాబ్‌ మాలిక్‌ను విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఏజెన్సీ మాలిక్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతకు ముందు నవాబ్‌ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ బరిలో దిగనున్నారన్న వార్తలపై మాలిక్‌ స్పందించారు. బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే నితీశ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా ఈడీ చర్యపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. మాలిక్‌ను అతని ఇంటి నుండి ఏజెన్సీ తీసుకువెళ్లిన విధానం మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌ చేసే విధంగా ఉందని విమర్శించారు. నవాబ్ మాలిక్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర కేబినెట్ మంత్రి అని అన్నారు. ఒక మంత్రిని రాష్ట్రానికి వచ్చి కేంద్ర ఏజెన్సీలు ఇలా తీసుకువెళ్తాయా అని ప్రశ్నించారు. 2024 తర్వాత మీరు కూడా(బీజేపీ) ఇలాగే విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ముందస్తు సమాచారం లేకుండానే మాలిక్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారని మహారాష్ట్ర ఎన్సీపీ అధినేత, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ అన్నారు.

అయితే, అండర్ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలు, అక్రమ ఆస్తుల లావాదేవీలు, హవాలాకు సంబంధించి ముంబైలో ఫిబ్రవరి 15న ఈడీ కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగానే నవాబ్‌ మాలిక్‌ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు