కేజ్రీవాల్‌కు మరో షాక్‌.. మరో ఆప్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

10 Oct, 2023 10:28 IST|Sakshi

ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలకు షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) తనిఖీలు చేపట్టింది. దీంతో, ఢిల్లీలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ఈడీ సోదాలపై ఆప్‌ నేతలు మండిపడుతున్నారు. 

వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఆప్‌ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. కాగా, అమానతుల్లా ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించి సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఆప్‌ ఎమ్మెల్యే మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నది. మరోవైపు, ఈడీ సోదాలపై ఆప్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవలే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, సంజయ్‌ సింగ్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజులు ఈడీ కస్టడీని విధించింది. దీంతో, లిక్కర్‌ స్కాం గురించి సంజయ్‌ సింగ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

ఇక, ఆప్‌ నేతల ఇళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా కేజ్రీవాల్‌ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: పాలస్తీనాకు మద్దతుగా సీడబ్ల్యూసీ తీర్మానం

మరిన్ని వార్తలు