నల్ల డైరీలో కీలకాంశాలు

27 Jul, 2022 06:26 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ అక్రమ నియామకాలకు సంబంధించిన స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పురోగతి సాధించింది. సోదాల్లో భాగంగా నాటి విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన ఇంట్లో నలుపు రంగు డైరీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కామ్‌కు సంబంధించిన కీలక ఆధారాలు అందులో రాసి ఉన్నట్లు ఈడీ చెబుతోంది. దీంతో దర్యాప్తు సరైన మార్గంలో కొనసాగేందుకు వీలవుతుందని ఈడీ అధికారులు చెప్పారు. బెంగాల్‌ ఉన్నత విద్య, పాఠశాల విద్యా విభాగానికి సంబంధించిన ఆ డైరీలోని 40 పేజీల్లో చాలా వివరాలు ఉన్నాయని ఈడీ తెలిపింది.

మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగా పార్థా, అర్పితాలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ నుంచి నేరుగా కోల్‌కతాలోని తమ ఆఫీస్‌కు తీసుకొచ్చి పార్థాను ప్రశ్నించారు. దీంతోపాటు గతంలో పశ్చిమబెంగాల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాఛార్యకు ఈడీ సమన్లు జారీచేసింది. బుధవారం కోల్‌కతాలోని తమ ఆఫీస్‌కు వచ్చిన వాంగ్మూలం ఇవ్వాలని ఈడీ ఆదేశించింది. ఈడీ గతంలోనే మాణిక్‌ ఇంట్లో సోదాలుచేయడం తెల్సిందే. కాగా, పార్థాను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి లేఖ రాశారు. 

మరిన్ని వార్తలు