Money Laundering Case: మాజీ సీఎం భార్యకు ఈడీ షాక్‌!

7 Aug, 2021 08:49 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

మాజీ ముఖ్యమంత్రి  మెహబూబా ముఫ్తీతల్లికి ఈడీ సమన్లు 

మనీ లాండరింగ్‌ ఆరోపణలు

శ్రీనగర్‌: మనీలాండరింగ్‌ కేసులో జమ్ము, కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తల్లి గుల్షన్‌ నజీర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. కేసు విచారణ కోసం ఆగస్టు 18న శ్రీనగర్‌ ఈడీ ఆఫీసుకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఫ్తీ ముహమ్మద్ సయీద్ భార్య  గుల్షన్‌ నజీర్‌.

70సంవత్సరాలు పైబడిన వృద్దురాలికి నోటీసులు పంపడంపై ముఫ్తీ, ఆమె పార్టీ పీడీపీలు తీవ్ర విమర్శలు చేశాయి. కాశ్మీర్‌లో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఏదైనా కార్యక్రమం చేపట్టగానే ఎవరికోఒకరికి సమన్లు జారీ అవుతాయని పీడీపీ దుయ్యబట్టింది. గురువారం కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసి రెండేళ్లయిన సందర్బంగా ముఫ్తీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఇందుకే ముఫ్తీ తల్లికి సమన్లు వచ్చాయని విమర్శించిన పీడీపీ, ఈ కేసు వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేసింది. కేసు వివరాలు, ఎఫ్‌ఐఆర్‌ వివరాలుంటే తాము లీగల్‌గా సిద్దమవుతామని తెలిపింది. 

మరిన్ని వార్తలు