సలసలకాగుతున్న వంట నూనె! 

30 Mar, 2021 20:59 IST|Sakshi

మార్చి నెలలో మరో పది శాతం పెరిగిన వంట నూనెల ధరలు

ఇప్పట్లో సెగ తగ్గేలాలేని వంట నూనెలు 

సాక్షి, న్యూఢిల్లీ: మెజారిటీ మధ్య తరగతి ప్రజలు వంట నూనెగా వినియోగించే పొద్దుతిరుగుడు పువ్వు నూనె కొండెక్కి కూచుంది. గడిచిన ఏడెనిమిది మాసాల్లో వంట నూనెల ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర 70 శాతం వరకు పెరిగింది. ఉత్తరాదిన ఎక్కువగా వినియోగించి ఆవ నూనె, సోయాబీన్‌ నూనె ధరలు 50 శాతం వరకు, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ధర 50 శాతం వరకు, పామాయిల్‌ ధర 55 శాతం వరకు పెరిగాయి. ఏడాది క్రితం కిలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ. 100 లకు లభించగా, ఇదే నూనె మార్చి 1 నాటికి కిలో ధర రూ. 150కి అటుఇటుగా ఉంది. తాజాగా ఈ నెల రోజుల్లో మరో పది శాతం పెరిగి రూ. 170కి చేరింది. మార్చి 28న ముంబై, భువనేశ్వర్‌ ప్రాంతాల్లో గరిష్టంగా కిలోకు రూ. 185 గా ఉంది. వేరుశనగ నూనె గరిష్టంగా తిరునల్వేలిలో కిలో ధర రూ. 194గా ఉంది. ఆవ నూనె గరిష్టంగా తిరుపతిలో కిలో ధర రూ. 200గా ఉంది. వనస్పతి గరిష్టంగా దర్బంగాలో కిలో రూ. 150గా ఉంది. ఇక పామాయిల్‌ గరిష్టంగా భువనేశ్వర్‌లో రూ. 143గా ఉంది.  

దిగుమతులపైనే ఆధారం.. 
మన దేశం పెట్రో ఉత్పత్తుల తరహాలోనే వంట నూనెల విషయంలో దిగుమతులపై ఆధారపడి ఉంది. దేశానికి అసవరమయ్యే వంట నూనెల్లో దాదాపు 60 శాతానికి పైగా దిగుమతుల ద్వారా సమకూర్చకుంటోంది. 2015–16 సంవత్సరం నుంచి వరుసగా 14.85 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, 15.32, 14.59, 15.57, 13.34 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల మేర వంట నూనెలు దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా 2015–16 నుంచి ఇప్పటివరకు వరుసగా 8.63 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, 10.09, 10.38, 10.35, 10.65 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల మేర వంట నూనెల లభ్యత ఉంది. 2019–20లో సోయాబీన్‌ ఆయిల్‌ 3.38 మిలియన్‌ టన్నుల మేర దిగుమతి చేసుకుంది.

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ 2.52 మిలియన్‌ టన్నుల మేర దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల నిల్వలు తగ్గి సరఫరా తగ్గడంతో వీటి ధరలు అమాంతం పెరుగుతూ వచ్చాయి. ధరల పెరుగుదల దెబ్బకు వంట నూనెల దిగుమతి తగ్గింది. అంతకుముందు ఏడాది ఫిబ్రవరిలో 10,89,661 టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనెలు దిగుమతి అయ్యింది. నవంబరు 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్యకాలంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ 7,70,364 టన్నులు దిగు మతి అయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 9,89,565 టన్నుల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి అయ్యింది. దిగుమతులు తగ్గి సరఫరా తగ్గడంతో మన దేశంలో వాటి ధర మరింత పెరిగింది.  

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తుల తగ్గుముఖం 
ఉక్రెయిన్, రష్యా దేశాల్లో పొద్దు తిరుగుడు పంట ఉత్పత్తి భారీగా తగ్గడంతో ఈ వంట నూనెల ధరలపై ప్రభావం పడింది. మలేషియా, ఇండోనేషియా దేశాల్లో పామాయిల్‌ ఉత్పత్తి భారీగా తగ్గింది. కూలీల కొరత వల్ల ఈ సమస్య ఏర్పడింది. అర్జెంటీనా నుంచి సోయాబీన్‌ ఆయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా, బ్రెజిల్‌ తదితర దేశాలు ఎల్‌నినో కారణంగా తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అర్జెంటీనా ఓడ రేవుల్లో సమ్మె నడవడంతో అక్కడి నుంచి కొద్ది రోజులపాటు ఎగుమతులకు ఆటంకం కలిగింది. ఈ కారణాలన్నీ వంట నూనెల పెరుగదలకు దారితీశాయి. ఈ పరిస్థితులన్నీ చక్కబడితే మార్చి, ఏప్రిల్‌ మాసాల వరకు వంట నూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుదని పరిశ్రమ వర్గాలు గతంలో అంచనా వేశాయి. కానీ మార్చి మాసంలో మరో 10 శాతం ధరలు పెరగడంతో నూనెల ధరల్లో పూర్వ స్థితి చేరుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. సన్‌ఫ్లవర్, సోయాబీన్‌ వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటడంతో పామాయిల్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

దిగుమతి సుంకం తగ్గాల్సిందేనా? 
గత నవంబరు 27న కేంద్ర ప్రభుత్వం క్రూడ్‌ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 37.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించింది. క్రూడ్‌ పామాయిల్‌పై 2013 జనవరి 23న 2.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం.. 24.12.2014న 7.5 శాతానికి పెరిగింది. 11.08.2017న 15 శాతంగా ఉంది. 17.11.2017న 30 శాతానికి పెరిగింది. మార్చి 1, 2018న ఇది 44 శాతానికి పెరిగింది. 01.01.2019న 40 శాతంగా, 01.01.2020న 37.5 శాతంగా, 27.11.2020న 27.5 శాతంగా ఉంది. ఇక రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ నూనెపై 17.03.2012న 7.5 శాతం దిగుమతి సుంకం ఉండగా.. 20.01.14న 10 శాతంగా, 24.12.2014న 15 శాతంగా, 17.09.2015న 20 శాతంగా, 14.06.18న 45 శాతంగా ఉంది. దేశంలో రైతులు పండించే నూనె గింజల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేందుకు వీలుగా దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ.. ధరల పెరిగిన సందర్భంలో తగిన రీతిలో సడలింపులు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఇక్కడ చదవండి: 
COVID-19: అక్టోబర్‌ 11 తర్వాత మళ్లీ...

భవిష్యత్తులో భారత్‌ మంచి మార్కెట్‌ కానుంది: కేఎఫ్‌సీ

మరిన్ని వార్తలు