భావి విద్యకు బాటలు

25 Dec, 2022 05:46 IST|Sakshi

తెరపైకి సమగ్ర విద్యా విధానం: మోదీ

గత పాలకులది బానిస మనస్తత్వం

దేశాన్ని వెనక్కు తీసుకెళ్లారన్న ప్రధాని

రాజ్‌కోట్‌: స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశ భావి అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా సమగ్ర విద్యా విధానం అమలుకు చిత్తశుద్ధితో కృషి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్‌ పాలనలో కనుమరుగైన మన ఉజ్జ్వల పురాతన గురుకుల విద్యా విధానం తదితరాల సుగుణాలను పునరుద్ధరించేందుకు స్వాతంత్రం రాగానే పాలకులు నడుం బిగించాల్సింది. కానీ బానిస మనస్తత్వంలో నిండా కూరుకుపోయిన గత ప్రభుత్వాలు ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయలేదు పైగా చాలా అంశాల్లో తిరోగమన ధోరణితో దేశాన్ని వెనక్కు తీసుకెళ్లాయి’’ అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.

‘‘ఇలాంటి తరుణంలో మన బాలలకు మళ్లీ గురుకుల తరహా నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధ్యాత్మిక గురువులు పూనుకున్నారు. శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ ఇందుకు ఉదాహరణ’’ అన్నార. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న సంస్థ 75వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాని శనివారం వీడియో లింక్‌ ద్వారా మాట్లాడారు. సనాతన భారతదేశం అన్ని విషయాల్లోనూ విశ్వ గురువుగా భాసిల్లిందన్నారు. ‘‘మిగతా ప్రపంచం అంధకారంలో మునిగి ఉన్న సమయంలో మన దేశం విద్యా దీపాలను సముఉజ్జ్వలంగా వెలిగించింది. నలంద, తక్షశిల వంటి మన విశ్వవిద్యాలయాలు ప్రపంచమంతటికీ నిస్వార్థంగా, వివక్షారహితంగా విద్యా దానం చేశాయి.

ఆత్మ తత్వం నుంచి పరమాత్వ తత్వం దాకా, ఆయుర్వేదం నుంచి సామాజిక శాస్త్రం, గణిత, లోహ అంతరక్ష శాస్త్రాల దాకా, సున్నా నుంచి అనంతం దాకా అన్ని శాస్త్రాలూ మన దేశంలో ఉచ్ఛ స్థాయిలో విలసిల్లిన కాలమది. వాటన్నింటినీ ప్రస్తుత తరాలకు అందించేందుకు స్వామి నారాయణ్‌ వంటి విద్యా సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి’’ అని ప్రశంసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య కళాశాలల వంటి అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యా సంస్థల సంఖ్య 65 శాతానికి పైగా పెరిగిందని చెప్పారు. ‘‘దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే విద్యా విధానం, విద్యా సంస్థల పాత్ర చాలా కీలకం. కాబట్టే ఈ దిశగా అన్ని స్థాయిల్లోనూ శరవేగంగా మెరుగైన మార్పులు తెచ్చేందుకు మేం నడుం బిగించాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు