చక్కగా పనిచేస్తున్నాయి..

6 Sep, 2020 04:57 IST|Sakshi

రాష్ట్రాల్లో సమర్థవంతంగా సంస్కరణల అమలు

‘సులభతర వాణిజ్యం’ ర్యాంకులు ప్రకటించిన కేంద్రం

అగ్రశ్రేణి ర్యాంకర్లకు నిర్మలా సీతారామన్‌ అభినందన

ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ 1

యూపీకి రెండో ర్యాంకు, తెలంగాణకు మూడో ర్యాంకు

సాక్షి, న్యూఢిల్లీ:  ‘క్షేత్ర స్థాయి ఇన్‌పుట్స్‌కు పెద్దపీట వేయడం ఈ ర్యాంకింగ్స్‌ ప్రక్రియలో మరో ముందడుగు. దేశ నిర్మాణానికి తోడ్పడే వారి అవసరాలను గుర్తించడం ఈ ప్రక్రియ గొప్పతనం. గడిచిన మూడేళ్లుగా కొన్ని రాష్ట్రాలు అసాధారణ పనితీరు కనబరుస్తున్నాయి. సంస్కరణలు అమలు చేస్తున్నాయి. అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచి ర్యాంకులు కనబరిచిన రాష్ట్రాలు సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేశాయి. ఈ ర్యాంకుల వెనక ఉద్దేశాన్ని గుర్తించి రాష్ట్రాలు చక్కగా పని చేస్తున్నాయి’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. శనివారం ఆమె డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషనల్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) రూపొందించిన నాలుగో విడత ర్యాంకులను ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, కేంద్ర పౌర విమానయానం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
 
► ఈ ప్రక్రియ ఆరోగ్యవంతమైన పోటీని సృష్టిస్తోంది. రాష్ట్రాల మధ్య చక్కటి పోటీని ఏర్పరుస్తుంది. రాష్ట్రంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ పోటీతత్వం పనిచేస్తుంది. ఇది సానుకూల అడుగు. ఆరోగ్యకరమైన పోటీకి సంకేతం. 
► కోవిడ్‌ సమయంలో ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ద్వారా అవసరమైన రంగాలకు చేయూతనిచ్చాం. ఇది సంస్కరణలకు మరింత ఊతమిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సంస్కరణలను అమలు చేయడం వల్ల మన దేశం పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతుంది. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి.
► తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఆయా రాష్ట్రాలు నిరంతరాయంగా సంస్కరణలను అమలు చేస్తున్నాయి. ప్రాంతాల వారీగా అగ్రస్థానం సాధించిన రాష్ట్రాలను కూడా అభినందిస్తున్నా. 

జోనల్‌ స్థాయిలో అగ్రస్థానం వీటిదే..
నార్త్‌జోన్‌లో యూపీ, తూర్పు జోన్‌లో జార్ఖండ్, పశ్చిమ జోన్‌లో మధ్యప్రదేశ్, దక్షిణ జోన్‌లో ఏపీ, ఈశాన్య జోన్‌లో అసోం అగ్రస్థానంలో నిలిచాయి.

రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి దోహదం : పీయూష్‌
► ఈ యాక్షన్‌ ప్లాన్‌ రాష్ట్రాల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పెట్టుబడులను ఆకర్షించే వాతావరణాన్ని సృష్టిస్తుంది. తద్వారా రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. రాష్ట్రాలు వాటి వ్యవస్థలను మెరుగు పరుచుకునేందుకు ఈ ర్యాంకులు దోహదపడుతాయి.
► సంస్కరణల అమలు వల్ల ర్యాంకులు మెరుగు పడతాయి. అగ్రశ్రేణి ర్యాంకులు సాధించిన రాష్ట్రాలు అత్యుత్తమ పనితీరు కనబరిచాయి. తక్కువ ర్యాంకు సాధించాల్సిన రాష్ట్రాలకు ఇది మేలుకొలుపు వంటిది. ర్యాంకులు కోల్పోయిన రాష్ట్రాలు మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. అగ్రశ్రేణి ర్యాంకులు సాధించిన రాష్ట్రాలకు అభినందనలు. 

మరిన్ని వార్తలు