షిండే వర్గమే సిసలైన శివసేన.. థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం భారీ షాక్‌

17 Feb, 2023 19:23 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్‌నాథ్‌ షిండే వర్గానికే సిసలైన శివసేన గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పార్టీ  విల్లు బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 

మహారాష్ట్రలో ఎనిమిది నెలల ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. బాల్‌ థాక్రే తనయుడు ఉద్దవ్‌ థాక్రేకు షాక్‌ ఇస్తూ.. శివసేన పార్టీ గుర్తింపును ఏక్‌నాథ్‌ షిండే(ప్రస్తుత మహారాష్ట్ర సీఎం) వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది.  

మహా వికాస్‌ అఘాడి కూటమి(శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఇతరులు)ని వ్యతిరేకిస్తూ.. గత జూన్‌ నెలలో కొందరు ఎమ్మెల్యేలతో శివసేన నుంచి బయటకు వచ్చేశారు ఏక్‌నాథ్‌ షిండే. ఆపై బీజేపీ సాయంతో రెబల్స్‌ను పలు ప్రాంతాలకు తిప్పుతూ.. చివరకు బీజేపీ సాయంతోనే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా షిండే, డిప్యూటీగా బీజేపీ నేత.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

ఈ తరుణంలో థాక్రే వర్గం, షిండే వర్గం సిసలైన శివసేన గుర్తింపు కోసం న్యాయ పోరాటానికి దిగాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం.. శివసేనపార్టీ పేరును, పార్టీ గుర్తైన విల్లు బాణంను పక్కనపెట్టి మరీ ఇరు వర్గాలకు ప్రత్యేక పేర్లు, గుర్తులను కేటాయించాలి. అయితే ఈసీ నిర్ణయంపై థాక్రే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. 

కిందటి నెలలో.. ఇరు వర్గాలు సిసలైన శివసేన అంటూ తమ తమ వాదనలతో కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట రాతపూర్వక ప్రకటనలు సమర్పించారు. ఈ తరుణంలో పోలింగ్‌ విభాగం ఇవాళ షిండే వర్గానికి శివసేన పార్టీ గుర్తును, సింబల్‌ను కేటాయించి.. థాక్రే వర్గానికి భారీ షాక్‌ ఇచ్చింది.

మరిన్ని వార్తలు