గోవా హోటల్‌లో చిందులు.. రెబెల్‌ ఎమ్మెల్యేలపై సీఎం షిండే అసంతృప్తి..

1 Jul, 2022 18:48 IST|Sakshi

సాక్షి, ముంబై: శివసేన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తమ నాయకుడు సీఎం అవ్వబోతున్నారని తెలిసి పట్టరాని సంతోషంగా గోవాలోని ఓ హోటల్‌లో బస చేస్తున్న రెబెల్‌ నాయకులంతా డ్యాన్స్‌ చేశారు. రెబెల్‌ ఎమ్మెల్యేలు మరాఠీ పాటలకు ఉత్సాహంగా  చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా ఎమ్మెల్యేల తీరుపై పలువురు విమర్శలు గుప్పించారు. అంతేగాక గోవాలోని హోటల్‌లో తన వర్గం ఎమ్మెల్యేలు డ్యాన్స్‌ చేయడంపై ఏక్‌నాథ్‌ షిండే అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం శుక్రవారం ఉదయం షిండే గోవాలోని హోటల్‌కు తిరిగి వెళ్లారు. ఎమ్మెల్యేలు డ్యాన్స్‌ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకోసారి అలాంటివి జరగొద్దని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.
చదవండి: కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్‌ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన

కాగా రెబెల్‌ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే దీపక్‌ ​కేసర్కర్‌ మాట్లాడుతూ.. అలా డ్యాన్స్‌ చేయడం పొరపాటని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అలా చేయడం మంచిది కాదని అన్నారు. సంతోషంలో అలాంటి తప్పు జరిగిపోయిందని, అలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. తామంతా బీజేపీతో కలిసి మహారాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
చదవండి: మాజీ సీఎం.. తాజాగా డిప్యూటీ సీఎం.. ఫడ్నవీస్‌ పేరిట ఓ రికార్డు

మరిన్ని వార్తలు