దారుణం: ఒక్క దెబ్బతో తల్లి ప్రాణం తీశాడు

17 Mar, 2021 08:15 IST|Sakshi
కౌర్‌ కుమారుడు తల్లిపై దాడి చేస్తున్న దృశ్యాలు వీడియో నుంచి (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

ఢిల్లీలో వెలుగు చూసిన దారుణం

వైరలవుతోన్న వీడియో.. మండిపడుతున్న నెటిజనులు

న్యూఢిల్లీ: నవ మోసాలు మోసి.. పురిటి నొప్పులు భరించి బిడ్డను కంటుంది తల్లి. అమ్మ అనే పిలుపు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన కడుపులో ఊపిరి పోసుకున్న ఆ ప్రాణి కోసం జీవితాంతం కష్టపడతుంది. తనకు చేతనైనంతలో బిడ్డకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. పిల్లల కోసం తన జీవితాన్నే కరిగించుకునే ఆ తల్లి కోరుకునేది చివరి దశలో చిన్న పలకరింపు.. కాస్తంత ప్రేమ. కానీ ఏందుకో ఏమో.. తమ కోసం జీవితాన్నే అర్పించిన తల్లిదండ్రులను చూసుకోవాలంటే మనసు రాదు లేదు చాలా మందికి. వృద్ధులని కూడా చూడకుండా వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పట్టెడన్నం పెట్టడానికి బరువై వారిని వదిలించుకుంటున్నారు. అది కుదరకపోతే చివరకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు.

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ ప్రబుద్ధుడు వృద్ధురాలైన తల్లిని కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిపై విరుచుకుపడుతున్నారు నెటిజనులు. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు అంటారు కానీ అది వాస్తవం కాదు.. స్వయంగా తల్లిదండ్రులను నరకంలోకి నెట్టేవాడు అంటున్నారు నెటిజనులు.

ఆ వివరాలు.. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో అవ్‌తార్‌ కౌర్‌ అనే 76 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు కోడలుతో కలిసి నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం పార్కింగ్‌ స్థలం గురించి కౌర్‌కు, పక్కింటి వారికి మధ్య వివాదం మొదలయ్యింది. అది కాస్త ముదరడంతో పొరుగింటి వారు పోలీసులకు కాల్‌ చేశారు. ఇంతలో కౌర్‌ కొడుకు కోడలు కిందకు వచ్చి జరుగుతున్న గొడవను చూశారు. తల్లి వల్ల అనవరంగా తాను పక్కింటి వారితో మాటలు పడాల్సి వచ్చిందని ఆగ్రహానికి గురైన కౌర్‌ కుమారుడు తల్లి చెంప మీద బలంగా కొట్టాడు.

దాంతో కౌర్‌ కింద పడిపోయింది. వెంటనే ప్రాణాలు విడిచింది. ఆమె కొడలు కౌర్‌ని పైకి లేపడానికి ప్రయత్నించింది.. కానీ అప్పటికే ఆమె ప్రాణం పోయింది. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు కౌర్‌ కుమారుడు, పొరుగింటి వారి మీద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. దాంతో ఈ వీడియో వైరలవుతోంది. 

చదవండి:

దారుణం: రోడ్డుపైనే.. చచ్చిపోయేంత వరకు..

మరిన్ని వార్తలు