ఆ రాష్ట్ర ఐకాన్‌గా ఫోక్ సింగర్.. 22 ఏళ్లకే అరుదైన ఘనత..

2 Jan, 2023 15:13 IST|Sakshi

పాట్నా: బిహార్ రాష్ట్ర ఐకాన్‌గా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్‌ను(22) నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి సోమవారం వెల్లడించారు. బిహార్ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా మైథిలి ఉండనున్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

22 ఏళ్ల మైథిలి ఠాకూర్‌  ఇండియన్ క్లాసికల్, ఫోక్ మ్యూజిక్‌లో శిక్షణ పొందారు. 2021లో బిహార్‌ జానపద సంగీతానికి తనవంతు భాగస్వామ్యం అందించినందుకు సంగీత్ నాటక్ అకాడెమీ ఆమెను 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌'తో సన్మానించింది.

బిహార్ మధుబనిలో జన్మించిన మైథిలికి ఆమె తండ్రి, తాత చిన్నతనం నుంచే జానపదం, హిందుస్తానీ క్లాసికల్ సంగీతం, హార్మోనియం, తబ్లాలో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమె ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తర బిహార్ ప్రాంతీయ భాష అయిన మైథిలితో పాటు హిందీ, భోజ్‌పురిలో జానపద పాటలు పాడి పాపులర్ అయ్యారు.

తన కూతురుకు ఈ అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని మైథిలి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు తన కూతురు కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.

చదవండి: 'సమాజం ఎటుపోతుందో ‍అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి'

మరిన్ని వార్తలు