80 ఏళ్లు పైబడ్డ వారికి ‘ఇంటి నుంచే ఓటు’

12 Mar, 2023 04:56 IST|Sakshi

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అమలు: ఈసీ

బెంగళూరు: 80 ఏళ్లు పై బడ్డ వారికి ఇంటినుంచే ఓటేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని అమలు చేస్తున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘80 ఏళ్లు దాటిన  వారు కూడా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటేయడాన్నే మేమూ ప్రోత్సహిస్తాం. అలా వెళ్లలేని వారికోసం తొలిసారిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాం’’ అని తెలిపారు.

‘‘ఇందుకోసం ‘సక్షమ్‌’ పేరిట మొబైల్‌యాప్‌ రూపొందించాం. అందులోకి వెళ్లి ఇంటి నుంచి ఓటేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఎన్నికల సిబ్బంది వారింటికి వెళ్తారు. వారిచ్చే ఫామ్‌ 12డి ద్వారా ఓటేయవచ్చు. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తాం. గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం’’ అని వివరించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్‌లైన్‌లోనే దాఖలు చేసేందుకు వీలుగా సువిధ పేరిట మరో మొబైల్‌ యాప్‌ రూపొందించినట్టు సీఈసీ వెల్లడించారు.

సమావేశాలు, ర్యాలీలకు కూడా దీని ద్వారానే అనుమతి కోరవచ్చన్నారు. అభ్యర్థి గురించి ఓటర్లకు అవగాహన కోసం నో యువర్‌ క్యాండిడేట్‌ (కేవైసీ) ఉద్యమం కూడా చేపట్టినట్టు చెప్పారు. ‘‘నేరచరిత్ర ఉన్న వారిని అభ్యర్థిగా ఎంచుకునే పార్టీలు అందుకు కారణాలను తమ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఓటర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇ–విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు’’ అన్నారు. కర్నాటకలో ఎన్నికల తేదీని త్వరలో నిర్ణయిస్తామన్నారు.

మరిన్ని వార్తలు