తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి.. సన్నద్ధత కోసం భేటీ

15 Apr, 2023 18:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉండడంతో..  ఇవాళ  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించింది ఈసీ. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు కీలక సూచనలు అందించడంతో పాటు పలు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ మేరకు ఢిల్లీ నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన ఈసీ బృందం ఒకటి హైదరాబాద్‌కు వచ్చింది. ఈసీ బృందానికి డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీశ్‌ వ్యాస్‌ నేతృత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈఓ) వికాస్‌ రాజ్‌తో పాటు ఇతర ఎన్నికల అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించింది. ఎన్నికల నిర్వహణ, సిబ్బందికి శిక్షణ ప్రధానాంశంగా ఈ భేటీ జరిగింది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని, అలాగే.. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వహించాలని ఆదేశించింది. రిటర్నింగ్‌ అధికారుల జాబితాను సిద్ధంచేయాలని, ఆర్వోస్‌ జూన్‌ 1 నుంచి ఈవీఎంల మొదటిస్థాయి తనిఖీలు ప్రారంభించాలని తెలిపింది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరింది ఈసీ బృందం.

మరిన్ని వార్తలు