కరోనా: ఎలక్షన్‌ కమిషన్‌ మార్గదర్శకాలు ఇవే!

21 Aug, 2020 19:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎలక్షన్‌ సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది, ఓటర్లు ప్రతి ఒక్కరికి  గ్లౌజులు ఇవ్వాలని, శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని ఈసీ ఆదేశించింది. ఓటరు రిజిస్టర్‌లో సంతకం చేయడం, ఓటేయడానికి ఈవీఎం బటన్ మీద నొక్కడం కోసం ఓటర్లందరికీ చేతి గ్లౌజులు ఇచ్చేలా ఈసీ మార్గదర్శకాలు రూపొందించింది.అలాగే ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరికి టెంపరేచర్‌ చెక్‌ చేసేలా థర్మల్‌ స్స్ర్కీనింగ్‌ను  ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించింది. 

సెప్టెంబర్ 20వ తేదీన బిహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ల అభ్యర్థనలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్-నవంబర్ నెలల్లో బిహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఈ ఏడాది చివరిలోగా జరిగే అవకాశం ఉంది. ఈసారి నామినేషన్లు, డిపాజిట్‌లు కూడా ఆన్‌లైన్‌లోనే స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషన్‌ చరిత్రలో తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లు, డిపాజిట్‌లు స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేసి,  ప్రింటౌట్‌ను రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందజేయొచ్చని సూచించింది.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల  సూచనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ బహిరంగ సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. అభ్యర్థితోపాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే వారి సంఖ్య ఐదుకు మించొద్దని ఈసీ నిబంధన విధించింది. కరోనా బారిన పడిన వారు, 80 ఏళ్లు దాటిన వారు, వైకల్యం ఉన్న వారు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహిస్తోన్న వారు పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ సడలింపులు ఇచ్చింది. ఓటు వేసే సమయంలో ఓటరు మాస్క్‌ను తొలగించి ఒకసారి నిర్ధారణ చేసుకున్న తరువాత ఓటు వేయడానికి అనుమతించనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఎందుకంటే ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎవరికైనా కరోనా సోకినట్లు తెలిస్తే వారి స్థానంలో మరొకరిని నియమించడానికి ఎక్కువ సిబ్బందిని  విధుల్లోకి తీసుకోనున్నారు. అలాగే కౌంటింగ్‌ సమయంలోనూ వేరు వేరు గదులలో సామాజిక దూరం పాటిస్తూ ఓట్లను లెక్కించనున్నారు.   

చదవండి: ఎన్నికలపై 3 రోజుల్లో మార్గదర్శకాలు

మరిన్ని వార్తలు