‘కోడ్‌’ ఉల్లంఘించిన ఎన్నికల కమిషన్‌!

26 Aug, 2020 17:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాను ఫొటోలతో సహా ఢిల్లీ పోలీసులకు అప్పగించాల్సిందిగా ఆదేశిస్తూ ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆగస్టు 25వ తేదీతో ఓ లేఖను రాసింది. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి సీసీటీవీ కెమేరాల ద్వారా గుర్తించిన అనుమానితులు ఎవరన్నది రూఢీ చేసుకోవడం కోసం పోలీసులు తమను ఓటర్ల జాబితాను కోరినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

ఓటర్ల జాబితాల విడుదలకు సంబంధించి 2008లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఖరారు చేసిన మార్గదర్శకాలు, 2020 వాటిని సవరిస్తూ ఖరారు చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు ఓటర్ల జాబితాను, అందులోనూ ఫొటోలున్న జాబితాను అందజేయరాదు. మార్గదర్శకాల ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాలతో ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ షేర్‌ చేసుకోవచ్చు. అయితే వాటికి ఫొటోలు ఉండకూడదు. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో కూడా ఈ జాబితాలు అందుబాటులో ఉంటాయి. ఫొటోలు ఉండవు.

పోలీసులు ప్రభుత్వం విభాగం పరిధిలోకే వస్తారనుకుంటే ఓటర్ల జాబితాను వారు కోరవచ్చు. అయితే ఫలానా, ఫలానా పేర్లు గల వారి జాబితా కావాలంటూ నిర్దిష్టంగా కోరాల్సి ఉంటుంది. ఆ మేరకే ఎన్నికల సంఘం కూడా స్పందించాల్సి ఉంటుంది. ఇక్కడ గుండు గుత్తగా ఢిల్లీ పోలీసులు కోరడం, వారికి గుండుగుత్తగా ఎన్నికల కమిషన్‌ వర్గాలు అందజేయడం ‘కోడ్‌’ను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది పౌరుల గోప్యతను కాల రాయడమే అవుతుందని పారదర్శకతను కోరుకునే సామాజిక కార్యకర్త సాకేత్‌ గోఖలే వ్యాఖ్యానించారు.

దీనిపై ఎన్నికల కమిషన్‌ అధికార ప్రతినిధి షెఫాలి శరణ్, ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణభీర్‌ సింగ్‌ స్పందించేందుకు నిరాకరించారు. ఇలా లేఖ రాయడం గందరగోళంగా ఉందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషి వ్యాఖ్యానించారు. (చదవండి: న్యాయవాది భూషణ్‌కు ఏ శిక్ష విధిస్తేనేం?)

మరిన్ని వార్తలు