అందుకే గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఆలస్యం: కేంద్ర ఎన్నికల సంఘం

3 Nov, 2022 16:12 IST|Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వందకు వంద శాతం నిష్పక్షపాతంగా విడుదల చేశామని, ఆలస్యం కావడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. గురువారం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం మీడియా చిట్‌చాట్‌లో ఆయన పాల్గొన్నారు. 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలు షెడ్యూల్‌ అంతా సవ్యంగానే ఉంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు రెండు వారాల గ్యాప్‌లోనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాం. అయినప్పటికీ ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఒకే రోజు ఉంటుంది అని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

ఎన్నికల సంఘం నిష్పాక్షికత.. గర్వించదగ్గ వారసత్వం. మేము 100 శాతం నిష్పక్షపాతంగా ఉన్నాం అని ప్రకటించారాయన. కొందరు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, మాటల కంటే చర్యలు, ఫలితాలు ఎక్కువగా మాట్లాడతాయి. కొన్నిసార్లు, కమిషన్‌ను విమర్శించే పార్టీలు ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందాయి. ఈ కేసులో థర్డ్ అంపైర్ లేడు. కానీ ఫలితాలు సాక్ష్యంగా ఉంటాయి అని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రధాన ప్రతిపక్షాలు గుజరాత్‌ షెడ్యూల్‌ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోదీ గుజరాత్‌ పర్యటన(దశల వారీగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగాయి) ముగిసే వరకు ఈసీ ఎదురు చూసిందని, తద్వారా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆటంకం ఎదురు కాకుండా పక్షపాతంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ ఎన్నికల సంఘం గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు కూడా కాంగ్రెస్‌-బీజేపీలు ఈసీ తీరుపై పరస్పరం ట్వీట్లు చేసుకున్నాయి. 

బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌ అసెంబ్లీ కాలపరిమితి ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుండగా.. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ కాలపరిమితి జనవరి 8వ తేదీతో ముగుస్తుంది. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్‌కు కాస్త ముందుగా షెడ్యూల్ విడుదల చేసినట్లు ఈసీ వెల్లడించింది. మోడల్ ప్రవర్తనా నియమావళి 38 రోజుల పాటు అమలులో ఉంటుంది, ఇదే అతి తక్కువ వ్యవధి. అది ఢిల్లీ ఎన్నికల మాదిరిగానే ఉంటుందని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. అంతేకాదు.. అసెంబ్లీ కాలపరిమితికి కౌంటింగ్‌ డేకి మధ్య 72 రోజుల గ్యాప్‌ ఉందని గుర్తు చేశారాయన. 

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, అసెంబ్లీ చివరిరోజు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా.. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఫలితాలు ఒకేసారి వెలువడడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి, సమతుల్యంగా వ్యహరించాల్సిన అవసరం మాకు ఉంది అని సీఈసీ వెల్లడించారు. 

మోర్బి ప్రమాద బాధితుల కోసం వెలువడే ప్రకటనలు..  ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండవచ్చా? అనే ప్రశ్నకు.. ఏదైనా నిర్ణయం వల్ల స్థాయి ఆటంకం ఏర్పడితే, ఎన్నికల సంఘం చర్య తీసుకుంటుందని రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు