ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’ 

19 Apr, 2021 06:39 IST|Sakshi
పద్మరాజన్‌

గిన్నిస్‌ లక్ష్యం అంటున్న పద్మరాజన్‌ 

సాక్షి, చెన్నై: గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలు జరిగినా తొలి వ్యక్తిగా నామినేషన్‌ వేసే పద్మరాజన్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నారు. గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడమే తన లక్ష్యమని ఈసందర్భంగా పద్మరాజన్‌ తెలిపారు. సేలం జిల్లా  మేట్టూరు సమీపంలోని ఎరటై పులియ మరత్తూరుకు చెందిన పద్మరాజన్‌(62). 1988 నుంచి ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి ఎన్నికలు జరిగినా తొలి నామినేషన్‌ వేస్తున్నారు. రాష్ట్రంలో అయితే సహకార సంఘాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో సైతం నామినేషన్లు వేశారు. ఓ సారి రాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ వేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచినా, రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

218 సార్లు.. 
ప్రతి ఎన్నికల్లోనూ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి డిపాజిట్‌ సొమ్ము చెల్లించి నామినేషన్లు వేయడం పద్మరాజన్‌ స్టైల్‌.  ఇప్పటి వరకు 218 సార్లు ఆయన నామినేషన్లు వేశారు. అయితే వార్డు సభ్యుడిగా కూడా ఆయన ఇంత వరకు గెలవలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పళనిస్వామికి పోటీగా ఎడపాడి నియోజకవర్గంలో, కేరళ సీఎం పినరయి విజయన్‌కు పోటీగా ధర్మడం నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇలా వరుస ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న ఆయనకు తాజాగా గుర్తింపు దక్కింది. ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు ఆయన్ను గుర్తించింది. తమ బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఆయనకు చోటు కల్పిస్తూ సర్టిఫికెట్‌ను పంపించారు. దీనిని ఆదివారం పద్మరాజన్‌ మీడియా దృష్టికి తెచ్చారు. 2021కి గాను రికార్డుల జాబితాలో ఆయనకు అత్యధిక సార్లు ఓటమి పాలైన అభ్యర్థిగా ఈ అవార్డు రావడం గమనార్హం. ఈ అవార్డు గురించి పద్మరాజన్‌ మాట్లాడుతూ గిన్నిస్‌ బుక్‌ రికార్డులో తన పేరు నమోదయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
చదవండి:
చావులోనూ... చేయి వదలనని..   
మాయలేడి: పరిచయం, రెండేళ్ల ప్రేమ.. పెళ్లనగానే!

మరిన్ని వార్తలు