ఎన్నికల సంస్కరణలకు రాజ్యసభలోనూ ఆమోదం 

22 Dec, 2021 08:45 IST|Sakshi

వ్యక్తిగత గోప్యతకు భంగకరమన్న ప్రతిపక్షాలు 

బోగస్‌ ఓట్లున్నవారే అడ్డుకుంటారన్న ప్రభుత్వం 

స్టాండింగ్‌ కమిటీకి అమ్మాయిల కనీస వివాహ వయసు పెంపు బిల్లు 

న్యూఢిల్లీ: ఓటర్‌ ఐడీని ఆధార్‌తో అనుసంధానించడం సహా కీలక సంస్కరణలున్న ఎన్నికల చట్టాల సవరణ బిల్లు– 2021కి రాజ్యసభ మంగళవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లుపై నిరసనలు వ్యక్తం చేసిన విపక్షాలు వాకౌట్‌ చేశాయి. సోమవారం ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఆమోదం లభించడంతో తదుపరి దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపుతారు. గతంలో పలు పార్టీల అభిప్రాయాలను సేకరించిన ఎన్నికల కమిషన్‌ ఈ అనుసంధాన సూచన చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు నిరసనకు దిగాయి.

ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు ఈ బిల్లు ఆటంకమని, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని విపక్షసభ్యులు ఆరోపించారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న వీరి డిమాండ్‌ను సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. బోగస్‌ ఓటర్ల ఏరివేతకు దీనితో అడ్డుకట్ట వేయవచ్చని న్యాయమంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. దొంగ ఓట్లకు అనుకూలురైనవారే ఈ బిల్లును నిరాకరిస్తారన్నారు. ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరి కాదని మరోమారు స్పష్టం చేశారు. బీజేపీ, జేడీయూ, ఏఐఏడీఎంకే, బీజేడీ, టీడీపీ, టీఎంసీ–ఎం తదితర పార్టీల సభ్యులు బిల్లుకు మద్దతు పలికారు. కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్‌జేడీ, ఎస్‌పీ, ఆప్, ఎన్‌సీపీ తదితర విపక్షాల సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్‌ చేశారు.  అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టింది.

చదవండి: (నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు హ్యాకయ్యాయి) 

దేశ చరిత్రలో ఇది ఒక నిర్ణయాత్మక అడుగని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లు అనేక వ్యక్తిగత చట్టాలపై ప్రభావం చూపుతుందని, ప్రాథమిక హక్కులకు భంగకరమని విపక్ష సభ్యులు విమర్శించారు. లోతైన అధ్యయనం కోసం ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపుతున్నామని ఈసందర్భంగా ఇరానీ చెప్పారు. లోక్‌సభ సమావేశాల ప్రత్యక్ష వీక్షణకు వీలు కల్పించే ఒక మొబైల్‌ యాప్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా ఆవిష్కరించారు. సాధారణ ప్రజలు పలు పార్లమెంటరీ డాక్యుమెంట్లను చూసేందుకు, వివిధ కమిటీల నివేదికలు చదివేందుకు కూడా ఈ ‘ఎల్‌ఎస్‌ మెంబర్‌ యాప్‌’ ఉపయోగపడుతుంది. మరోవైపు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను ముందుగా అనుకున్నట్లు ఈ నెల 23 వరకు కాకుండా 22కే ముగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

చదవండి: (Mamata Banerjee: కోల్‌కతా దీదీదే.. తృణమూల్‌ ‘హ్యాట్రిక్‌’)

ఈ చట్టాల్లో మార్పులు 
అమ్మాయిల కనీస వివాహ వయసును పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుతో బాల్య వివాహా నిషేధ చట్టం– 2006లో సవరణలు చేస్తారు. ఇందులో మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21కి మారుస్తారు. ఈ చట్టంలో మార్పుతో కొన్ని పర్సనల్‌ చట్టాల్లో కూడా సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లు ద్వారా కింది చట్టాల్లో సవరణలు చేస్తారు. 
1. ద ఇండియన్‌ క్రిస్టియన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ 
2. ద పార్సీ మ్యారేజ్‌ అండ్‌ డైవర్స్‌ యాక్ట్‌ 
3. ద ముస్లిం పర్సనల్‌ లా అప్లికేషన్‌ యాక్ట్‌ 
4. ద స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ 
5. ద హిందూ మ్యారేజ్‌ యాక్ట్‌ 
6. ద ఫారెన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌

డెరెక్‌ ఓబ్రియాన్‌పై  సస్పెన్షన్‌ వేటు 
రాజ్యసభలో టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియాన్‌పై మంగళవారం సస్పెన్షన్‌ వేటు పడింది. మంగళవారం ఎన్నికల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ‘ ప్రభుత్వం సాగు చట్టాల సమయంలో చేసినట్లే ఇప్పుడూ చేస్తోంది’ అంటూ చేతిలోని రూల్‌బుక్‌ను డెరెక్‌ చైర్‌పైకి విసిరి వాకౌట్‌ చేశారు. ఆయన విసిరిన పుస్తకం సభాపతికి ముందు కూర్చునే అధికారుల బల్లపై పడింది. దీంతో డెరెక్‌ను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.   

మరిన్ని వార్తలు