ఈ–వాహనాలకు ఆకర్షణీయమైన సబ్సిడీలు

25 Jul, 2021 00:36 IST|Sakshi

కొత్త ఈవీ పాలసీని ఆవిష్కరించిన ప్రభుత్వం

ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు రూ. 10 వేలు

ఫోర్‌ వీలర్స్‌కు రూ. లక్ష వరకు సబ్సిడీ

ముంబై సెంట్రల్‌: రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలకు (ఈ–వాహనాలు) ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు నూతన ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) పాలసీని అమలు చేయడం ప్రారంభించింది. ఈ కొత్త విధానంలో భాగంగా, ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి సబ్సిడీలు ఇవ్వనుంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనేవారికి రూ. 15 వేలు, నాలుగు చక్రాల వాహనాలు(ఫోర్‌ వీలర్స్‌)కొనేవారికి ఒక లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2021 డిసెంబర్‌ 31వ తేదీ లోపు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసినట్లయితే కొనుగోలుదారులకు అదనంగా మరో రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు అదనపు సబ్సిడీ లభిస్తుందని దీనిపై అవగాహన ఉన్న కొందరు అధికారులు తెలిపారు.

ఏ కంపెనీకి చెందిన వాహనాలను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ అందించనుంది. రాబోయే నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో పది శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉండేలా నూతన ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ నూతన విధానం ప్రకారం ముంబై, పుణె, నాగ్‌పూర్, ఔరంగాబాద్, అమరావతి, నాసిక్‌ లాంటి నగరాల్లో నడిచే మొత్తం పబ్లిక్‌ వాహనాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలను 25 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకోసం 2025 వరకు రాష్ట్రంలోని ఏడు నగరాల్లో 2,500 ఛార్జింగ్‌ సెంటర్‌లను నెలకొల్పాలని అనుకుంటోంది. అంతేగాక, వచ్చే ఏప్రిల్‌ నుంచి కేవలం విద్యుత్‌ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్, పెట్రోల్‌ ధరలతో పోల్చితే విద్యుత్‌ ధర చాలా తక్కువ. అంతేగాక ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలు పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించవు. దీంతో అనేక మంది వినియోగదారులు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అందించే ప్రోత్సాహాకాల్లో భాగంగా రాబోయే ఆరు నెలల్లో కొనుగోలు చేసే లక్ష వాహనాలకు 25 వేల వరకు సబ్సిడీ లభించనుంది.

మొదటి పది వేల నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుపై రూ. 2 నుంచి రూ. 2.5 లక్షల వరకు సబ్సిడీ దక్కనుంది. రిక్షా, గూడ్స్‌ వాహనాలు, టెంపో లాంటి వాహనాల కొనుగోలుపై కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్‌ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది. స్లో చార్జింగ్, ఫాస్ట్‌ చార్జింగ్‌ విభాగాల్లో రూ. 10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ఉండనుంది. స్లో చార్జింగ్‌లో వాహనాలు 6 నుంచి 8 గంటల్లో, ఫాస్ట్‌ చార్జింగ్‌లో 2 నుంచి 3 గంటల్లో చార్జింగ్‌ పూర్తి చేసుకుంటాయి. కాగా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నూతన ఎలక్ట్రిక్‌ వాహనాల విధానాన్ని మహారాష్ట్ర ఫిక్కీ, ఈ–వాహనాల విభాగ టాస్క్‌ఫోర్స్‌ సభ్యురాలు సులజ్జ ఫిరోదియా–మోట్వాణీ, మరాఠా చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీస్‌ అండ్‌ అగ్రికల్చర్‌ విభాగ ఉపాధ్యక్షుడు దీపక్‌ కరండీకర్‌ స్వాగతించారు.

మరిన్ని వార్తలు