కొడుకు కష్టం చూడలేక.. తుక్కుతో ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన తండ్రి

30 Mar, 2023 13:12 IST|Sakshi

అతనో మధ్య తరగతి వ్యక్తి. రోజంతా కష్టపడితే గానీ బతుకు బండి ముందుకు సాగదు. తన కొడుకు రోజూ సుదూరం నడిస్తే గానీ కాలేజ్‌కి వెళ్లలేని పరిస్థితి. కొడుకుకి కొత్త బైక్‌ కొనిద్దామంటే తన స్థోమత సరిపోదు.. అలా అని చూస్తూ ఉండలేకపోయాడు ఆ తండ్రి. అందుకే ఆ వ్యక్తి స్వయంగా ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసి తన కొడుకుకు బహుమతిగా ఇచ్చాడు. 

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కరంజా పట్టణానికి చెందిన రహీమ్‌ఖాన్‌ చిన్న కొడుకు షఫిన్‌ఖాన్‌ ఇంటికి దూరంగా ఉన్న కాలేజీకి నడుస్తూ వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను ఇంటి నుంచి కాలేజ్‌ వెళ్లి రావడం కష్టంగా ఉందంటూ తన తండ్రి వద్ద మొరపెట్టుకున్నారు. తన స్నేహితులకు ఉన్నట్లు తనకీ ఓ బైక్‌ ఉంటే బాగేండేదని తండ్రికి చెప్పుకున్నాడు. అయితే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ రహీమ్‌ఖాన్‌ తన ఇంట్లోనే చిన్న దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో రహీమ్‌ఖాన్‌ తన కొడుకు బాధ చూడలేక ఈ సమస్యకు పరి​ష్కారంగా.. తానే స్వయంగా ఓ ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేయాలని అనుకున్నాడు.

స్వతహాగా అతను ఎలక్ట్రిషియన్‌ కావడంతో ఈ పని కాస్త సులువు అయ్యింది. రహీమ్‌ బైక్ తయారీకి ఉపయోగించిన దాదాపు అన్ని పదార్థాలు స్క్రాప్ డీలర్ల నుంచి తెచ్చుకున్నావే. పైగా చాలా వరకు మార్కెట్లో తక్కువ ధరకు దొరికే వస్తువులతో ఈ బైక్‌ని తయారు చేశాడు. దీన్ని తయారీకి అతనికి 2 నెలలు సమయం పట్టగా.. దాదాపు 20,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఇంట్లో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 25 కి.మీల వరకు ప్రయాణించవచ్చు. అత్యధికంగా 60 కిలోల వరకు బరువును ఈ బైక్‌ మోయగలదు. ఈ బైక్‌ వేగం, బరువు మోసే సామర్థ్యాన్ని పెంచడానికి మరింత శక్తివంతమైన బ్యాటరీ, మోటారును అమర్చాలని యోచిస్తున్నట్లు రహీమ్ చెప్పారు. ప్రస్తుతం షఫిన్ ఖాన్ రోజూ ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్‌పై కాలేజీకి వెళ్తున్నాడు.

మరిన్ని వార్తలు