స్టాండింగ్‌ కమిటీకి ‘విద్యుత్‌’ బిల్లు

9 Aug, 2022 05:26 IST|Sakshi
లోక్‌సభలో మంత్రి ఆర్‌కే సింగ్‌

విపక్షాల డిమాండ్‌ల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

లోక్‌సభలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు

తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు బిల్లుకు వ్యతిరేకం: అధిర్‌ రంజన్‌

సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్‌ పంపిణీ రంగంలో ప్రైవేట్‌ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పించే వివాదాస్పద విద్యుత్‌ సవరణ బిల్లు–2022ను విస్తృత సంప్రదింపుల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తూ విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. రైతు వ్యతిరేక బిల్లు అన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూనే బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటించారు. సోమవారం ముందుగా లోక్‌సభలో విపక్ష పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఈ బిల్లును సింగ్‌ ప్రవేశపెట్టారు. దీనిని విపక్షాలు వ్యతిరేకించాయి.

సమాఖ్య స్ఫూర్తికి విరుధ్ధం: అధిర్‌ రంజన్‌  
కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. బిల్లుతో కేంద్ర పెత్తనం పెరిగి రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతోంది. తెలంగాణ, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌తో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ బిల్లును ఉపసంహరించుకుంటామని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం)కు కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో మాట తప్పి బిల్లును ప్రవేశపెట్టారు’ అని అ«ధిర్‌ రంజన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి సింగ్‌
‘రైతులకు ఉచిత విద్యుత్‌ ఇకపైనా కొనసాగుతుంది. ఈ బిల్లు రైతు సంక్షేమ, ప్రజాహిత బిల్లు. బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని విద్యుత్‌ మంత్రి సింగ్‌ అన్నారు. మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు ఓటింగ్‌కు డిమాండ్‌ చేశాయి. అయితే స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చుంటే ఓటింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పలువురు సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. వెంటనే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ కోరగా, స్పీకర్‌ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. మూజువాణి ఓటుతో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్ర మంత్రి అనుమతి కోరగా, స్పీకర్‌ అనుమతి ఇచ్చారు. దీనికి సభ్యులంతా ఆమోదం తెలిపారు.

విద్యుత్‌రంగ ఉద్యోగుల నిరసన బాట
విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం లక్షలాది మంది విద్యుత్‌ రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు సోమవారం నిరసన గళం వినిపించారు. దేశంలోని అన్ని విద్యుదుత్పాదక సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్లుసహా మొత్తం దాదాపు 27 లక్షల మంది సోమవారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారని అఖిల భారత విద్యుత్‌ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్‌) ప్రకటించింది. విద్యుత్‌ వినియోగదారులకు ఇచ్చే రాయితీలకు చరమగీతం పాడే, రైతులు, అణగారిన వర్గాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారిన బిల్లులోని అంశాలను వెంటనే తొలగించాలని ఏఐపీఈఎఫ్‌ అధ్యక్షుడు శైలేంద్ర దూబే డిమాండ్‌చేశారు. ‘బిల్లులోని నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో ఎక్కువ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ నెట్‌వర్క్‌ను వాడుకుంటూ కొత్త ప్రైవేట్‌ సంస్థ లాభాలు తెచ్చే వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమలకే విద్యుత్‌ అందించే ప్రమాదముంది. మొండి బకాయిలుగా మారే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ ఇవ్వాలా వద్దా అనేది వారి ఇష్టం. ప్రభుత్వ విద్యుత్‌ పంపిణీ సంస్థలు మాత్రం అందరికీ సరఫరా చేయాల్సిందే. దీంతో ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు నష్టాలపాలవుతాయి’ అని దూబే అన్నారు.

మరిన్ని వార్తలు