‘కాంగ్రెస్‌ చెప్పింది కరెంట్‌ బిల్లులు కట్టం’.. విద్యుత్‌ శాఖ అధికారిపై దాడి.. ముదిరిని పంచాయితీ

24 May, 2023 20:29 IST|Sakshi

కర్ణాటకలో కరెంట్‌ బిల్లు పంచాయితీ చినికి చినికి గాలివానలా తయారైంది. ‘మేం కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’ అంటూ పలు గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. కరెంటు బిల్లులు కట్టాలన్న అధికారులకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ పెద్దలు చెప్పారు కాబట్టి విద్యుత్‌ బిల్లులు కట్టేది లేదని చిత్రదుర్గ జిల్లా జాలికట్టెలో ఇటీవల గ్రామస్తులు మొండికేసిన విషయం తెలిసిందే.

తాజాగా మరో గ్రామంలో మీటర్‌ రీడింగ్‌ కోసం వచ్చిన విద్యుత్‌ అధికారిపై ఓ వ్యక్తి రెచ్చిపోయి ప్రవర్తించాడు. అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుండా చెప్పుతో దాడి చేశాడు. దీన్నంతటిని మరొకరు వీడియో తీయగా.. అతనిపై సైతం ఆవేశంతో అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

కాగా,  అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. జూన్‌ 1 నుంచి ఎవరూ కరెంటు బిల్లు చెల్లించరాదని కేపీసీసీ అద్యక్షుడు డీకే శివకుమార్‌ ఎన్నికల ప్రచార సభల్లో కూడా ప్రకటించారు.

మరోవైపు తమకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదని.. ఆదేశాలు వస్తే మీకు ఉచితంగా కరెంటు ఇస్తాం, అప్పటివరకు బిల్లులుకట్టాలని విద్యుత్ అధికారులు తెలిపారు. దీనికి ఒప్పుకోని గ్రామస్తులు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్‌ ఫ్రీ అని చెప్పారు. కాబట్టి మేం బిల్లులు చెల్లించేది లేదు. దీనిపై మీరు ప్రభుత్వానికి చెప్పండి అని కరాఖండిగా చెబుతున్నారు. 
చదవండి: రోడ్డుపై కనికట్టు..బొగ్గు, చాక్‌పీస్‌లతో ఒక కాలువను సృష్టించినా! వీడియోలతో

మరిన్ని వార్తలు