‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’

11 Mar, 2021 19:24 IST|Sakshi
బిడ్డను కాపాడబోయి మృతి చెందిన ‘గంగ’ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

కంటతడిపెట్టిస్తోన్న కథనం.. సోషల్‌ మీడియాలో వైరల్‌

కోల్‌కతా: బిడ్డల కోసం తల్లి ఎంత సాహసానికైనా తెగిస్తుంది. వారు ప్రమాదంలో ఉన్నారంటే.. తన ప్రాణాలను పణంగా పెట్టి మరి బిడ్డలను కాపాడుకుంటుంది. అందుకే దేవతలు సైతం అమ్మ ప్రేమను అనుభవించడం కోసం మానవ జన్మ ఎత్తుతారని అంటుంటారు. మనుషుల్లోనే కాక జంతువుల్లో కూడా అమ్మప్రేమ కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. బిడ్డ ప్రాణాలు కాపాడబోయి తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను జీవ పరిరక్షణ శాస్త్రవేత్త నేహా సిన్హా ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ప్రసుత్తం ఈ స్టోరి తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

బెంగాల్‌ అటవీ ప్రాంతంలో ‘గంగ’ అనే ఏనుగు ఉండేది. కొద్ది రోజుల క్రితం అది తన మందతో కలిసి సమీపంలోని పొలాల్లోకి వెళ్లింది. దీనిలో తన బిడ్డ కూడా ఉంది. గ్రామస్తులు తమ పొలాల్లోకి వచ్చిన ఏనుగుల మందను తరిమాడంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో ఏనుగుల మందకు ఓ రైల్వే క్రాస్‌ లైన్‌ అడ్డు వచ్చింది. గంగ, దానితో పాటు వచ్చిన ఏనుగులు అన్ని రైల్వే లైన్‌ను దాటాయి. కానీ గంగ బిడ్డ మాత్రం పట్టాలపై చిక్కుకుపోయింది. ఎలా దాటాలో అర్థం కాక అలానే నిల్చుంది. ఇంతలో దూరంగా రైలు వస్తోన్న శబ్దం వినిపించింది. దాంతో బిడ్డను కాపాడ్డం కోసం గంగ పట్టాల మీదకు వెళ్లింది. బిడ్డను పట్టాలపై నుంచి బయటకు పంపింది. ఈ క్రమంలో అటుగా వచ్చిన రైలు గంగను ఢీకొట్టింది. దాంతో అది అక్కడికక్కడే చనిపోయింది. 

ఈ క్రమంలో నేహా సిన్హా గంగ దాని బిడ్డ ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘కుటుంబం కోసం ప్రాణాలిస్తాం అని మనం చెప్తాం. కానీ ఏనుగుల చేసి చూపుతాయి. ఇక గంగ, దాని బిడ్డను కొద్ది రోజుల క్రితం అవిజాన్‌ సాహా అనే ఉత్తర బెంగాల్‌ వ్యక్తి ఫోటో తీశాడు. అదే ఇది. బిడ్డ కోసం తన ప్రాణాలు కోల్పోయింది గంగ’’ అంటూ ఫోటో ట్వీట్‌ చేసింది. ఇది చూసిన వారంతా.. ‘‘మా గుండె పగిలిపోయింది.. కన్నీరాగడం లేదు.. ఈ ఘటన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి:
ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి

‘నాకు సిగ్గేస్తుంది.. ఫోటోలు తీయొద్దని చెప్పు’

మరిన్ని వార్తలు