తప్పతాగి పడిపోయిన ఏనుగుల గుంపు.. అవి తాగింది నిజమేనా? అధికారులు ఏమన్నారంటే..

10 Nov, 2022 19:48 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: ఏనుగులు తప్పతాగి పడిపోవడంమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. ఒడిశాలోని కియోంజర్‌ జిల్లాలోని షిల్పాద గిరిజన గ్రామ ప్రజలు అదే చెప్తున్నారు. తాము నాటు సారా తయారీ కోసం పులియబెట్టిన ద్రావణాన్ని 24 ఏనుగుల గుంపు తాగేసి సోయి తప్పి పడిపోయాయని అంటున్నారు. స్థానిక గిరిజనులు చెప్తున్న వివరాల ప్రకారం.. షిల్పాదా జీడిమామిడి అడవిలోకి గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్లాం. అక్కడే తమకు మహువా (ఇప్ప పూలు) పువ్వులతో నాటు సారా తయారు చేసుకునే కుటీరం ఉంది. మొత్తం 24 ఏనుగుల గుంపు తమ కుటీరం వద్ద ఒక్కోటి ఒక్కోచోట పడుకుని ఉన్నాయి. 

అవి నిద్రకు ఉపక్రమించాయేమోనని తొలుత భావించాం. వాటిని నిద్ర లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ, సారా తయారీకని మహువా పువ్వులను నీటిలో పులియబెట్టిన ద్రావణాన్ని అక్కడ నిల్వ ఉంచాం. అది కనిపించలేదు. ఆ కుండలన్నీ పగలిపోయి ఉన్నాయి. కొన్ని ఖాళీగా కనిపించాయి. అప్పుడు తెలిసింది.. అవి ఆ ద్రావణాన్ని ఫూటుగా సేవించి మత్తుగా పడుకుని ఉన్నాయని! వెంటనే విషయాన్ని అటవీ అధికారులకు తెలిపామని నిరయా సేథి అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏనుగుల్లో 9 మగ, 9 ఆడ, 6 గున్నవి ఉన్నాయని వెల్లడించారు.
(చదవండి: ప్రెగ్నెంట్‌ అంటూ... ప్లాస్టిక్‌ బొమ్మతో షాకిచ్చిన మహిళ!)

అటవీ అధికారులు ఏమన్నారంటే..
పాటనా అటవీ రేంజ్‌ అధికారులు షిల్పాద ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు భారీ డ్రమ్ములను వాయించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏనుగులు నిద్ర లేచి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు పాటనా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఘసీరాం పాత్రా తెలిపారు. అయితే, గ్రామస్తులు చెప్తున్నట్టుగా ఏనుగులు సారా తయారీ ద్రావణాన్ని తాగడంపై క్లారిటీ లేదని.. అవి గాఢ నిద్రలో ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, మహువా పూల శాస్త్రీయ నామం మధుకా లోంగిఫోలియా. భారత్‌లోని పలు ప్రాంతాల గిరిజన ప్రజలు ఈ పూలతో సారా తయారు చేసుకుంటారు.
(చదవండి: ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర)

మరిన్ని వార్తలు