ఆ చీతాల రక్షణ విధుల్లోకి గజరాజులు.. రేయింబవళ్లు గస్తీ!

20 Sep, 2022 11:59 IST|Sakshi

భోపాల్‌: సుమారు 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన వన్యప్రాణులైన 8 చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఈ చిరుతలను.. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ కునో నేషనల్‌ పార్క్‌లో ఈనెల 17వ తేదీన విడిచిపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడటానికి మరో రెండు నుంచి నాలుగు నెలల పాట చీతాలను పెద్ద ఎన్‌క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. ఆ తర్వాతే స్వేచ్ఛగా జాతీయ పార్క్‌లో విడిచిపెడతారు. మరోవైపు.. ఈ చీతాల భద్రతకు అన్ని ఏర్పాటు చేప్టటారు కునో పార్క్‌ నిర్వహణ అధికారులు. 

చీతాల రక్షణ కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. రెండు ఏనుగులను రంగంలోకి దింపారు. నర్మదాపురంలోని సత్పురా టైగర్‌ రిజర్వ్‌కు చెందిన రెండు గజరాజులను కునో పార్క్‌కు తీసుకొచ్చారు. వాటికి ఉన్న అనుభవం ఆధారంగా గజరాజులు లక్ష‍్మి, సిద్ధనాథ్‌లను గత నెలలోనే పార్క్‌కు తీసుకొచ్చారు అధికారులు. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన 5 చిరుతలను బయటకి తరిమేసే ఆపరేషన్‌లో ఈ రెండు ఏనుగులు కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు గజరాజులు నేషనల్‌ పార్క్‌ సెక్యూరిటీ బృందాలతో కలిసి రేయింబవళ్లు గస్తీ కాస్తున్నాయి. ఏనుగులతో తిరుగుతూ చీతాలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఏనుగులు ఉండటం ద్వారా ఏ వన్యప్రాణులు చీతాలు ఉన్న ఎన్‌క్లోజర్‌ వైపు రావని చెబుతున్నారు. 

‘పులుల రెష్యూ ఆపరేషన్‌లో 30 ఏళ్ల సిద్ధనాథ్‌ మంచి గుర్తింపు పొందాడు. అయితే, సిద్ధనాథ్‌కు టెంపర్‌ సమస్య ఉంది. 2010లో ఈ ఏనుగు కోపానికి ఇద్దరు బలయ్యారు. అలాగే..2021, జనవరిలో ఓ టైగర్‌ను నియంత్రించటంలో సిద్ధనాథ్‌ కీలక పాత్ర పోషించింది. 25 ఏళ్ల లక్ష‍్మి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, తన పనిలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది’ అని తెలిపారు కునో నేషనల్‌ పార్క్‌ డీఎఫ్‌ఓ ప్రకాశ్‌ కుమార్‌ వర్మ.

ఇదీ చదవండి: 70 ఏళ్ల తర్వాత భారత్‌లోకి 8 చీతాలు.. వాటిలో ఒకదానికి పేరు పెట్టిన ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు