హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు!

28 Apr, 2022 12:55 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!

సౌత్‌ పవర్‌
హిందీ మన జాతీయ భాష కాదు. హిందీ నా మాతృభాష కాదు. అది 23 అధికారిక భాషల్లో ఒకటి, అంతే. ఇంకోవైపు దక్షిణ భారత సినిమాలు 2021లో 2,400 కోట్లు ఆర్జించాయి. బాలీవుడ్‌ కేవలం 800 కోట్లు. బడాయిపోవడం ఆపండి.
– కత్యూషా, ఉపాధ్యాయురాలు

మెరుగవడం ఆగదు
గత పదహారేళ్లుగా నేను ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నాను.ఎన్నో మార్పుల్నీ, ఎత్తుపల్లాల్నీ, గొప్ప విషయాలనీ, భయంకర అంశాల్నీ నేను చూశాను. కానీ అన్ని మంచి సంభాషణల్లా, మనం పెరుగుతూ మెరుగు అవుతున్నట్టుగానే ఇదీ పరిణామం చెందుతూ ముందుకు సాగుతూనే ఉంటుంది.
– డానీ, ఫిలిం మేకర్‌

తగినంత స్వేచ్ఛ
‘భావ స్వేచ్ఛ’ అన్నప్పుడు నా ఉద్దేశం ఏమంటే, ఏది చట్టానికి సరిపోతుందో అది! చట్టాన్ని దాటి సెన్సార్‌షిప్‌ చేయడానికి నేను వ్యతిరేకిని. ఒకవేళ జనాలు తక్కువ భావ స్వేచ్ఛను కోరుకుంటే, వాళ్లు ప్రభుత్వాలను దానికి అనుగుణంగా చట్టాల్ని చేయమని అడుగుతారు. కాబట్టి, చట్టాన్ని దాటిపోవడం అనేది జనాల ఇచ్ఛకు విరుద్ధం. 
– ఎలాన్‌ మస్క్, వ్యాపారవేత్త

మనతో మనల్ని కలిపేది
యోగా, ప్రకృతి పరస్పర సంబంధం కలిగినవి. ప్రకృతిలో ఎక్కువ సేపు గడపడమనే అతి మామూలు అంశం, బయటి ప్రపంచంతో సంబంధం ఏర్పరుచుకోవడానికి కీలకం కాగలదు. మరో వైపు యోగా, మనల్ని మన అంతర్గత ప్రకృతితో, అంటే మన అసలు తత్వంతో అనుసంధానించగలిగినంతటి శక్తిమంతమైనది.
– సధావీ ఖోస్లా, ఆధ్యాత్మిక వాది

సాగాలి సంభాషణ
తల్లిదండ్రులు తమ కూతుళ్ల విషయంలో జాగ్రత్త పేరుతో కఠినంగా ఉంటున్నారు. ఇతర అబ్బాయిలతో ఆరోగ్యకర సామాజిక సంపర్కం ఏర్పరుచు కోవడాన్ని అనుమతించడం లేదు. కుటుంబ ‘గౌరవం’ మొత్తాన్నీ కూతుళ్ల మీదే మోపడం... వేటగాళ్ల వలలో యువతులు పడే ప్రమాదాన్ని మరింతగా పెంచుతోంది.
– ఆమ్నా ఖాన్, న్యాయవాది

ఇలా చేయొచ్చు
ఒకవేళ అందరు వీఐపీలు తమ ఎస్కార్ట్‌ వాహనాల్లోంచి ఒక్క వాహనాన్ని తగ్గించినా, ప్రభుత్వాలకు ఎంత చమురు ఆదా కాగలదో ఊహించండి.
– ప్రసేన్‌జిత్‌ దత్తా, ఆర్థికాంశాల సలహాదారు

మనో వ్యసనం
ఒకదాన్ని వ్యసనంగా చేసుకోవడమంటే, మన మెదడు దాన్ని మన మనుగడకు తప్పనిసరి అని భావించుకుంటుంది. అట్లాగే మతం అనేది కూడా మనోవ్యసనమేనా?
– ఇంతియాజ్‌ మహమూద్, నాస్తికుడు

మరిన్ని వార్తలు