పద్మభూషణ్‌ బాలకృష్ణ దోషి కన్నుమూత.. ప్రధాని సంతాపం

24 Jan, 2023 16:56 IST|Sakshi

ఢిల్లీ: దశాబ్దాల పనితనంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రముఖ ఆర్కిటెక్ట్ నిపుణులు, పద్మ భూషణ్‌ బాలకృష్ణ దోషి(95) ఇక లేరు. మంగళవారం అహ్మదాబాద్‌లోని తన స్వగృహంలో ఆయన అనారోగ్యంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది.  ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. లె కార్బూజియెగా(ఛార్లెస్‌ ఎడ్వర్డ్‌ జెనరెట్‌), లూయిస్ కాన్ లాంటి విదేశీ ఆర్కిటెక్ట్‌లతో కలిసి పని చేసిన అనుభవం ఆయనది. అహ్మదాబాద్‌ ఐఎంఎంతో పాటు పలు ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణంలో ఆయన పాలు పంచుకున్నారు. దోషి మృతిపై పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. 

డాక్టర్ బివి దోషి జి ఒక తెలివైన వాస్తుశిల్పి. గొప్ప సంస్థకు నిర్మాత. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి... అని ట్వీట్‌ ద్వారా సంతాపం తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 

1927 పూణే(మహారాష్ట్ర)లో జన్మించిన బాలకృష్ణ విఠల్‌దాస్‌ దోషి.. బెంగళూరు ఐఐఎంతో పాటు అహ్మదాబాద్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండాలజీ, సీఈపీటీ యూనివర్సిటీ, కార్నియా సెంటర్‌లను డిజైన్‌ చేశారు. వీటితో పాటు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని అరణ్య లో కాస్ట్‌ హౌజింగ్‌ టౌన్‌షిప్‌నకు రూపకల్పన చేయగా.. అది ప్రతిష్టాత్మక అగాఖాన్‌ అవార్డును 1995లో దక్కించుకుంది. 

ఇక వాస్తుశిల్ప పేరుతో సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకుని అహ్మదాబాద్‌లో ఆయన సెటిల్‌ అయ్యారు. ఆయన కుటుంబంలో చాలామంది ఆర్కిటెక్ట్‌లు ఉన్నారు. 2018లో ప్రిట్జ్‌కర్‌ ఆర్కిటెక్చర్‌ అవార్డు(ఈ ఘనత సాధించిన తొలి ఆర్కిటెక్ట్‌) అందుకున్నారు. పద్మశ్రీతో పాటు 2020లో భారత ప్రభుత్వం ఆయన చేసిన కృషికిగానూ పద్మ భూషణ్‌ పురస్కారం అందించింది. ఇక 2022లో దోషి రాయల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్స్‌ నుంచి  రాయల్‌ గోల్డ్‌ మెడల్‌ పురస్కారం అందుకున్నారు.

మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఓ కాదల్‌ కన్మణి, షాద్‌ అలీ ఓకే జాను చిత్రాల్లోనూ బాలకృష్ణ దోషి ఒక చిన్న పాత్రలో మెరిశారు. తన ప్రాజెక్టులు దాదాపుగా అహ్మదాబాద్‌తో ముడిపడి ఉండడంతో శేషజీవితాన్ని అక్కడే గడిపారాయన.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు