Sanjay Raut: మనీలాండరింగ్ కేసులో సంజయ్‌ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ

31 Jul, 2022 20:48 IST|Sakshi

ముంబై: శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని  ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల నగదును జప్తు చేశారు. సంజయ్‌ రౌత్‌తో పాటు, ఆయన కుటుంబసభ్యులపై రూ.1000కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి.

సంజయ్ రౌత్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటికి వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు.

పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్‌ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్‌ ఇంటికి వెళ్లి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు.. సంజయ్‌ రౌత్‌ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీకి భయపడను అంటూ కామెంట్స్‌ చేశారు. ఏప్రిల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.

చదవండి: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు బిగ్‌ షాక్‌

మరిన్ని వార్తలు