-

జార్ఖండ్‌ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు.. రెండు ఏకే 47 తుపాకులు సీజ్‌

24 Aug, 2022 14:45 IST|Sakshi

రాంఛీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు రాంఛీలో బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఇంట్లో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈయన జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు సన్నిహితుడు కావడం చర్చనీయాంశమైంది. ప్రేమ్ ప్రకాశ్‌ ఈ ఆయుధాలు అక్రమంగా కలిగి ఉన్నారా? అనే విషయంపై మాత్రం ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. వీటిని సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

రూ.100కోట్ల మైనింగ్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సీఎం సన్నిహితుడు పంకజ్ మిశ్రా, బచ్చు యాదవ్‌లు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. పంకజ్ మిశ్రా, అతని సన్నిహితుల నివాసాల్లో ఈడీ అధికారులు జులై 8నే దాడులు చేశారు. మొత్తం 19 చోట్ల సోదాలు చేశారు. మార్చిలోనే వీరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

మైనింగ్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. సోదాల్లో  కీలకమైన పత్రాలు, బ్యాంకు బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాలు లభించాయి. అయితే ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో లభించిన ఏకే 47 తుపాకుల విషయంపై ఆయన గానీ, సీఎం సోరెన్‌ గానీ స్పందించలేదు.
చదవండి: టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు..

మరిన్ని వార్తలు